ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలకు వలవేసి…

fb

ఆ కంత్రీ… నేరాలకు ఫేస్‌బుక్‌నే అడ్డాగా మార్చుకున్నాడు. అందమైన అమ్మాయిలకు వలవేస్తాడు. ఒక్కసారి అందులో చిక్కుకుంటే బయటపడడం కష్టం. వాళ్ల పర్సనల్ డిటేల్స్ సేకరిస్తాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరికొందరికి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ట్రాప్ చేశాడు. ఇలా ఎంతోమందిని మోసం చేశాడు ఆ కేటుగాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ఆరు నెలలు శ్రమించాల్సి వచ్చింది.

దొంగ చూపులు చూస్తున్న ఈ కేటుగాడే ఎంతో మందిని మోసం చేశాడు. పేరు జోగాడ వంశీ కృష్ణ. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలకు వలవేసేవాడు. వాళ్ల వ్యక్తిగత వివరాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. భయపడిన అమ్మాయిల నుంచి డబ్బు, బంగారు నగలు లాక్కుని… జల్సాలు చేసేవాడు.

ఈ కేటుగాడి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ట్రిపుల్‌ఈ చదివి లైఫ్‌లో సెటిల్ కావల్సిన వాడు… జల్సాలకు అలవాటు పడి పెడతోవ పట్టాడు. 2012లో పెద్దాపురం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈఈఈలో చేరాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీమనీకి అలవాటుపడి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. కానీ ఈ కంత్రీ అక్కడ పనిచేసే అమ్మాయిలపై కన్నేశాడు. యువతులతో పరిచయం పెంచుకుని మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. కొంతమంది దగ్గర లక్షలాది రూపాయలు తీసుకుని మళ్లీ కాకినాడకు మకాం మార్చాడు.

కాకినాడలో మరో కొత్త దందా మొదలు పెట్టాడు. ఫేస్‌బుక్‌నే అడ్డాగా చేసుకుని అందమైన అమ్మాయిలకు వలవేశాడు. ఓ వైద్య విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించాడు. దాన్ని అడ్డంపెట్టుకుని ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె దగ్గరి నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నాడు.

మోసపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వంశీకృష్ణ బండారం బయటపడింది. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. గత ఆరు నెలల్లో 25 సిమ్‌కార్డులు మార్చి పోలీసులకు ముప్పతిప్పలు పెట్టాడు ఈ ఫేస్‌బుక్ మోసగాడు.

 

యువతుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో దర్జాగా జల్సాలు చేశాడు వంశీకృష్ణ. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు… అతడి దగ్గరి నుంచి 70 వేల నగదు, లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తులతో ఫేస్‌బుక్‌లో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -