వణికిస్తున్న భారీ వర్షాలు, వరదలు.. 16 మంది మృతి

heavy rain northindia

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలమవుతోంది. యూపీలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. షాజహాన్‌పూర్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. సీతాపూర్ జిల్లాలో ముగ్గురు, ఔరయ, అమేథి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, లఖింపూర్ ఖిరి, రాయ్‌బరేలి, ఉన్నావ్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో రోడ్లుపై వాహనాలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. గాలి వాన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది… సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

అటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్‌ ధామ్ కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర కాశీకి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై కొండ చరియలు ఓ కారుపై విరిగి పడ్డాయి. ఇక అస్సాంలో భారీ వర్షాల కారణంగా 37వ నెంబర్ జాతీయ రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో అస్సాం-మేఘాలయ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి