చేపలు తాజావంటూ .. కళ్లు పీకి..

ఏదైనా సరే తాజాగా ఉంటే రేటు ఎక్కువైనా వినియోగదారుడు కొనడానికి ఆసక్తి చూపిస్తాడు. పైకి తాజాగా కనిపిస్తూ ఇంటికి వచ్చాక అది ఫ్రెష్ సరుకు కాదని తెలిస్తే షాపు వాడిని తిట్టిన తిట్టకుండా తిడుతుంటారు. వీలైతే షాపుకు వెళ్లి నాలుగు చీవాట్లు పెడతారు కొని మోసపోయిన వారు. సరిగ్గా అలానే చేశాడు కువైట్‌కి చెందిన ఓ మాంసాహార ప్రియుడు. చేపలు తినాలనిపించి ఎంతో ఇష్టంగా మార్కెట్‌కి వెళ్లి చేపలు కొందామని చూస్తున్నాడు.

తాజాగా ఉన్నాయి సార్ తీస్కోండి అంటూ షాపు యజమాని పదే పదే చెబుతుండే సరికి అనుమానం వచ్చిన సదరు కొనుగోలు దారుడు చేపకళ్లు తేడాగా ఉండడాన్ని గమనించాడు. ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. తాజాగా కనిపించడం కోసం కళ్లు అతికించానన్నాడు. షాపు యజమాని చేస్తున్న మోసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొనుగోలు దారుడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వార్త వాణిజ్య మంత్రిత్వ శాఖ వరకు వెళ్లింది. షాపు లైసెన్స్ రద్దు చేస్తూ మూసి వేయించింది కువైట్ ప్రభుత్వం.