ప్రభాస్‌ని చూసి నేర్చుకోండి: నటులపై మండిపడ్డ మంత్రి

వరదల కారణంగా కేరళ రాష్ట్రం విలవిల్లాడింది. కళ్లముందే వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు. మరి కొన్ని ప్రాణాలు జలసమాధి. హృదయ విదారకంగా అనిపించిన ఈ దృశ్యాలన్నికళ్లముందు సాక్షాత్కరిస్తూ ప్రతి ఒక్కరినీ కలచివేసాయి. తమకు తోచిన సాయాన్ని ఆపన్నులకు అందించారు. తమ బాధగా చేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు కదిలారు. సాయం చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ముందు వరుసలో నిలిచింది. అందులో హీరో ప్రభాస్ ఒక మెట్టు ఎక్కువే వున్నారు. కోటి రూపాయల సాయం అందిస్తూ కేరళ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు.

కేరళ పర్యాటక మంత్రి సైతం కేరళ నటులకు ప్రభాస్‌ని స్ఫూర్తిగా చూపిస్తున్నారు. కేర్ కేరళ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ కేరళలో ఎందరో సూపర్‌స్టార్లు ఉన్నారు. ప్రతి సినిమాకు రూ.4 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని విన్నాను. వారంతా ప్రభాస్‌ని చూసినేర్చుకోండి అని అన్నారు. ఆయన మలయాళ సినిమాల్లో నటించకపోయినా బాధితుల కోసం కోటి రూపాయల సాయం అందించడానికి ముందుకొచ్చారు అని వ్యాఖ్యానించారు సురేంద్రన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కోటి రూపాయలు విరాళంగా అందజేసారు.