అందుకే ‘మా’ లో విభేదాలు రచ్చకెక్కాయా?

shivaji-vs-naresh-telugu-movie-artist-association-split-over-alleged-misappropriation

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో నిధులు గోల్‌మాల్‌ సంచలనంగా మారింది. మా అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా నిధులను మింగేశాడని… మెగా ఈవెంట్‌తో వచ్చిన డబ్బును దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం కలకలం రేపింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవి నుంచి శివాజీరాజాను తొలగించి నరేష్ స్వయంగా ఈ పదవిని హస్తగతం చేసుకున్నారని వార్తలొచ్చాయి. మా కార్యాలయానికి తాళాలు వేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో శివాజీరాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, హీరో శ్రీకాంత్.. మీడియా ముందుకు వచ్చి ఎదుట స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు.

అసోసియేషన్ పైసలతో కనీసం టీనీళ్లు కూడా తాగలేదని.. ఏదైనా తిన్నట్లు నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తానంటూ శివాజీరాజా సవాల్‌ విసిరారు. ఫోన్‌ కూడా సొంతదే వాడుతున్నానని.. నా జేబులో డబ్బులే 50 వేలు తీసి సాయం చేశానంటూ వాపోయారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని.. నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

మరోవైపు జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సీనియల్‌ నటుడు నరేశ్‌ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ.. కాల్‌, మెసేజ్‌ డేటాను బయటపెట్టారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుందామని చిరంజీవి తమకు భరోసా ఇచ్చారన్నారు నరేశ్.

ఇక.. చిరంజీవి రెండు కోట్ల రూపాయలు ఇస్తానన్నా.. కోటి రూపాయలకే ఒప్పుకోవడం తనను ఆశ్చర్యపర్చిందని నరేశ్‌ అన్నారు. అయినా చిరంజీవి, మహేష్‌, ప్రభాస్‌ ఈవెంట్లు లోకల్‌లో జరిగినా 5 కోట్ల రూపాయలు వస్తాయని.. మరి వారి ఈవెంట్లు అమెరికాలో ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేశారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ పుట్టి పాతికేళ్లయింది. ఈ సందర్భంగా తలపెట్టిన సిల్వర్ జూబ్లీ ఈవెంట్‌పై ముసలం పుట్టింది. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కాస్ట్యూమర్ల నుంచి స్టంట్ మాస్టర్ల దాకా 24 క్రాఫ్ట్స్‌కీ విడివిడిగా అసోసియేషన్లుంటాయి. వాళ్లల్లో వాళ్లు ఎన్ని తంటాలు పడ్డప్పటికీ ఇలా రోడ్డుమీదకొచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కేవలం ఆర్టిస్టుల సంఘం మాత్రమే ఇలా తరచూ గొడవలకు దిగుతున్నాయి. ఇందులోని 740 మంది సభ్యుల్లో చిన్నచిన్న కమెడియన్లతో పాటు.. పెద్దపెద్ద సూపర్‌స్టార్లు కూడా వుంటారు. అయినా వీళ్ల పంచాయతీ తీర్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. దాసరి నారాయణరావు లాంటి పెద్దలున్నప్పుడు ఇవన్నీ లోలోపలే సర్దుకునేవి. కానీ.. ఇప్పుడు పెద్ద దిక్కు లేకపోవడంతో.. విభేదాలు రచ్చకెక్కాయని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

-ADVT-