ఇన్ఫోసిస్‌ రికార్డ్‌- స్టీల్‌ స్ట్రిప్స్‌ జోరు

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిడెట్‌ కౌంటర్‌ ఓవైపు సరికొత్త గరిష్టాన్ని తాకగా.. మరోపక్క స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణాలున్నాయ్‌.. వివరాలు చూద్దాం..

ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌
వాటాదారులకు బోనస్‌ షేర్లను కేటాయించాక సాఫ్ట్‌వేర్‌ సేవలకు దేశంలోనే రెండో ర్యాంకులో కొనసాగుతున్న ఇన్ఫోసిస్ లిమిటెడ్‌ కౌంటర్‌కు మరింత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 745 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 748.50 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. కంపెనీ 1:1 నిష్పత్తిలో వాటాదారులకు బోనస్‌ షేర్లను ప్రకటించిన విషయం విదితమే. బోనస్‌ షేర్ల జారీకి ఈ నెల 5 రికార్డ్‌ డేట్‌ కావడంతో నేటి నుంచీ ఈ కౌంటర్‌ ఎక్స్‌బోనస్‌లో ట్రేడవుతోంది. లిస్టింగ్‌ తరువాత 25వ వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా ఇన్ఫోసిస్ బోర్డు జులై 13న బోనస్ షేర్ల జారీకి అనుమతించింది. దీంతో సోమవారంవరకూ కంపెనీలో కొనసాగిన ఇన్వెస్టర్లకు తమ దగ్గరున్న ప్రతీ షేరుకీ మరో షేరుని ఫ్రీగా పొందనున్నారు. కాగా.. ఇన్ఫోసిస్ షేరు ఈ ఏడాది జనవరి నుంచీ ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి ఇప్పటివరకూ 42 శాతం లాభపడింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 13 శాతమే పుంజుకోవడం ప్రస్తావించదగ్గ విషయం!

స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌
ఆగస్ట్‌లో వీల్‌ రిమ్‌ అమ్మకాలు 14 శాతం పుంజుకున్నట్లు వెల్లడించడంతో ఆటో విడిభాగాల సంస్థ స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ బలపడింది. ఆటుపోట్ల మార్కెట్‌లోనూ ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 2 శాతం పుంజుకుని రూ. 1202 వరకూ ఎగసింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 1188 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో వీల్‌ 14.14 లక్షల వీల్‌ రిమ్ములను విక్రయించినట్లు స్టీల్‌ స్ట్రిప్స్ తెలియజేసింది. తద్వారా నికర అమ్మకాల విలువ 34 శాతం జంప్‌చేసి రూ. 166 కోట్లను అధిగమించినట్లు తెలియజేసింది.