అమెజాన్‌ రికార్డ్‌- అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌

శ్రామిక దినోత్సవం సందర్భంగా సోమవారం సెలవులో కొనసాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. డోజోన్స్‌ స్వల్పంగా 12 పాయింట్లు(0.05 శాతం) క్షీణించి 25,952 వద్ద నిలవగా… ఎస్‌అండ్‌పీ 5 పాయింట్లు(0.17 శాతం) తక్కువగా  2,897 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 18 పాయింట్లు(0.23 శాతం) నీరసించి 8,091 వద్ద  స్థిరపడింది. ఫ్యాక్టరీల తాజా ఆర్డర్ల కారణంగా ఆగస్ట్‌లో తయారీ రంగం 14ఏళ్ల గరిష్టానికి చేరిన వార్తలతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) పూర్తిస్థాయి సవరణకు సంబంధించి కెనడాతో చర్చలు విఫలంకావడం, చైనా దిగుమతులపై టారిఫ్‌లు, యూరోపియన్‌ యూనియన్‌ వాణిజ్య విధానాలపై ట్రంప్‌ అసంతృప్తి వంటి  అంశాలు సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ నేలచూపు
బ్రోకింగ్‌ సంస్థ మోఫెట్‌నాథన్‌సన్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 2.6 శాతం వెనకడుగు వేసింది. ఆదాయం క్షీణించే వీలున్నట్లు గైడెన్స్‌ ప్రకటించడం దీనికి కారణంకాగా.. టెక్నాలజీ కంపెనీలు అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌ సైతం స్వల్పంగా బలహీనపడ్డాయి. ప్రకటనలకు సంబంధించి వివాదాలలో చిక్కుకోవడంతో నైక్‌ ఇంక్‌ 3.2 శాతం పతనమైంది. బ్రోకింగ్‌ సంస్థ బార్‌క్లేస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌ 2.2 శాతం నష్టపోయింది. కాగా.. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇంట్రాడేలో దాదాపు 2 శాతం బలపడింది. షేరు ధర 2050 డాలర్లను అధిగమించింది. ఫలితంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ తదుపరి లక్ష కోట్ల(ట్రిలియన్‌) డాలర్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)ను సాధించిన కంపెనీగా నిలిచింది. చివరికి 1.3 శాతం లాభంతో 2040 డాలర్ల సమీపంలో స్థిరపడింది.