పాలమూరులో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్‌

bjp party meeting in new delhi

తెలంగాణలో పార్టీలన్నీ ముందస్తు మంత్రాంగంలో పడిపోయాయి.. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తుండగా.. కమలనాథులు కూడా దూకుడు పెంచుతున్నారు. జాతీయ నేతలతో ప్రచారానికి ప్లాన్‌ చేస్తున్నారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఆ టూర్‌ నుంచే ఎన్నకల శంఖం పూరించేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వచ్చిన తర్వాత బీజేపీ నేతల్లో ముందస్తు హడావిడి కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీ రద్దు అవుతుందని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే అమిత్‌షాతో హైదరాబాద్‌లో రెండు దఫాలు భేటీలు నిర్వహించగా.. తాజాగా అధిష్టానం ఆదేశాలతో ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఈనెల 12న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మహబూబ్‌నగర్‌ పర్యటనకు రానున్నారు. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభే ముందస్తు ఎన్నికల శంఖారావంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులతో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ముందస్తు ముహూర్తం తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో లక్ష మంది హాజరయ్యేలా చూడాలని వారికి సూచించారు.

అటు ముందస్తు ఎన్నికలు రావడమంటే బీజేపీ నెత్తిన పాలు పోసినట్లుగానే కమలనాథులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసోం తరహా ప్లాన్‌నే తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెసేతర శక్తులను దగ్గరకు తీసుకుంటామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

పాలమూరులో బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్న కమలనాథులు ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈనెల 12తోపాటు.. మరో ఆప్షన్‌గా పదిహేనో తేదీ చూస్తున్నారు. రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. డేట్‌ ఎప్పుడైనా పాలమూరు సెంటిమెంట్‌ ప్లేస్‌ కావడంతో ఇక్కడ్నుంచే ఎన్నికల శంఖారావానికి బీజేపీ ప్లాన్‌ చేస్తోంది.