అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఎందుకు.. : చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ మరోసారి గైర్హాజరు అవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు నిలదీశారు. మొన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని సభలో నిలదీసేందుకు సిద్ధమైంది..

ప్రధాన ప్రతిపక్షం లేకుండానే మరోసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఏడెనిమిది రోజుల పాటు సాగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. సభకు హాజరుకావాలని స్పీకర్‌ తమను కోరారని అందులో గుర్తుచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. వెంటనే సభకు వస్తామని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంతో తాము సమావేశాలకు హాజరుకావడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.

వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశం ఆ పార్టీకి లేదన్నారాయన. అసలు అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఎందుకని చంద్రబాబు నిలదీశారు.

సభలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకపోయినా.. బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే టీడీపీ, బీజేపీ స్నేహానికి తెగదెంపులు చేసుకున్నాయి. ఇద్దరు బీజేపీ మంత్రులు పదవులకు రాజీనామా కూడా చేశారు. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శిస్తున్న కమలనాథులు.. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ పరిశీలించారు. పూర్తిస్థాయిలో జరిగే చివరి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.

ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులను శాసనమండలి చైర్మన్ ఫరూక్ ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న రోజుల్లో అసెంబ్లీ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.