అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగి..

shelter home

బీహార్‌లోని పట్నా, ముజఫ్ఫర్‌పూర్‌ వసతిగృహంలో ఇటీవల వెలుగుచూసిన దారుణాలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలు మరకవ ముందే మరో దారుణం జరిగింది. షెల్టర్‌లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో బేగుసరాయ్ బాలికల వసతిగృహం వివాదంలో చిక్కుకుంది. 42 మంది యువతులు ఆశ్రయం పొందుతున్న ఈ వసతి గృహంలో ఓ యువతి అద్దం ముక్కలు మింగేసి ఆత్మాహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్మ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలను బాధితురాలు బయటపెట్టింది.

వార్డెన్‌తోపాటు ఇతర సిబ్బంది తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. గతంలో వార్డెన్ తన దుస్తులను లాగేసి, తీవ్రంగా కొట్టిందని వాపోయింది. కొద్దిరోజులుగా తనకు కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని వివరించింది. అయితే బాధితురాలి ఆరోపణలను వార్డెన్ అనుజా కుమారి ఖండించింది. వసతి గృహంలోని వారందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకూ ఎవరినీ కొట్టలేదని, తమపై ఆరోపణలు రావటం ఇదే తొలిసారని ఆమె తెలపడం గమనార్హం.