గన్‌మెన్‌ తో ఫ్యాంట్ క్లీన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం.. వైరల్‌

deputy cm

కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర.. వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి.. గన్ మెన్ చేత ఫ్యాంట్ శుభ్రం చేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిప్యూటీ సీఎం పరమేశ్వర.. రెండు రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు వచ్చారు. ఉల్సూరులోని ఎల్లమ్మకోయిల్ ప్రాంతంలో పర్యటించారు. స్థానికంగా పర్యటించి.. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన లాల్చీ ఫ్యాంట్‌కు బురద అంటుకుంది. స్థానిక కార్పొరేటర్.. శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా.. మంత్రి వారించారు. గన్‌మెన్ ను పిలిచి శుభ్రం చేయమని ఆదేశించారు. దీంతో గన్ మెన్ తన ఖర్చీఫ్ తీసుకుని బురదను తుడిచేశాడు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న వారు మొబైల్లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ గామారింది.

గన్‌మెన్‌తో ఫ్యాంట్ క్లీన్ చేయిస్తున్న వీడియో చూసిన నెటిజెన్లు.. మంత్రి పరమేశ్వరపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి.. ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పరమేశ్వర.. సిగ్గుపడండి. నేను మంత్రిని. నాకు అందరూ సేవలు చేయాలి వంటి మైండ్ సెట్ ఉన్నందుకు.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పరమేశ్వర మంత్రి కావచ్చు.. తన తీరు మార్చుకోక పోతే.. ప్రజలు కంత్రీగా గుర్తిస్తారని మరో నెటిజన్ విమర్శించాడు.

గన్‌మెన్‌ తో ఫ్యాంట్ క్లీన్ చేయించుకున్న వీడియో వైరల్ కావడం.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. పరమేశ్వర ఘటనపై వివరణ ఇచ్చారు. తన సిబ్బందని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానన్న ఆయన.. వారే తన బలమని అన్నారు. తనపై విమర్శలు రావడం బాధాకరమన్నారు.