డీఎంకే పార్టీలో కొనసాగుతున్న అళగిరి అశాంతి

karunanidhi son alagiri halchal in dmk sparty

డీఎంకే పార్టీలో అళగిరి అశాంతి కొనసాగుతూనే ఉంది. కరుణానిధి మరణం తర్వాత పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్‌ను ఎంత మాత్రం ఒప్పుకోనని హల్‌చల్‌ చేసిన అళగిరి.. ఆ తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ శాంతి ర్యాలీ పేరుతో మరో అలజడి సృష్టిస్తున్నారు. చెన్నైలోని కరుణానిధి సమాధి వరకు ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి అళగిరి శాంతిర్యాలీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ శాంతి ర్యాలీతో తన బలమేంటో చూస్తారంటూ ఇటీవల అళగిరి ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయమై ఆసక్తి ఏర్పడింది. ఈ ర్యాలీకి లక్షల్లో తన అభిమానులు తరలివస్తారని అళగిరి ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే చెన్నై రోడ్లపై సందడి కనిపిస్తోంది. బ్యాండ్‌బాజాలతో అళగిరి సపోర్టర్లు.. ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఈ ర్యాలీ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. రెండువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మొదట్నుంచీ స్టాలిన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు అళగిరి. తండ్రి కరుణానిధి సర్దిచెప్పినా విన్లేదు. దీంతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. దీంతో ఆయనకు స్టాలిన్‌తో మరింత దూరం పెరిగింది. కరుణానిధి మరణంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారనిపించినా.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. అసలైన డీఎంకే క్యాడర్‌ తనతోనే ఉందని, స్టాలిన్‌ను అధ్యక్షుడిగా అంగీకరించనంటూ ప్రకటించారు అళగిరి. ఆ తర్వాత స్టాలిన్‌ డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా.. అళగిరి సైలెంట్‌గా ఉన్నారు. అయితే తనను పార్టీలోకి తీసుకోవాలంటూ తరచూ డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా మరోసారి శాంతిర్యాలీ పేరుతో తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.