రైలు పట్టాలపై శవం.. క్షణాల్లో బాలాజీ ప్రత్యక్షం..

ఏ చిన్న కారణాన్నీ తట్టుకోలేక పోతున్నారు. ఆత్మహత్యే శరణ్యమంటూ తనువు చాలిస్తున్నారు. కొందరి జీవితాలు రైలు పట్టాలమీదే శవాలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి దృశ్యాలను చూడాలంటే హృదయం ద్రవిస్తుంది. మనసు అల్లకల్లోలమవుతుంది. మరి అలాంటి బాడీలను తరలించడానికి నేనున్నానంటూ ముందుకొస్తాడు కార్తికేయ బాలాజీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నగరంలో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ప్రమాదవశాత్తూ రైళ్ల కింద పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

man-helps-died-people-over-railway

అయితే రైల్వే శాఖ మెకానికల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్న కార్తికేయ బాలాజీ శవం ఉన్నదగ్గరికి క్షణాల్లో చేరుకుని అక్కడినుంచి తొలగిస్తాడు. సకాలంలో రైళ్లు ప్రయాణించేలా చూస్తాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు బాలాజీ ప్రత్యక్షమవుతాడు. పట్టాలపై బాడీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అక్కడి నుంచి తరలిస్తాడు. శవాలను తొలగించడమే కాకుండా అనారోగ్యంతో రైలు ప్లాట్ ఫాంలపై పడి ఉన్న రోగులను సైతం ఆసుపత్రికి తరలించి వారికి చేతనైనంత సహాయాన్ని అందిస్తాడు. ఇతడి సేవలను గుర్తించిన రైల్వేశాఖ బాలాజీకి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ రైలు బోగీలో ఓ సీటును రిజర్వు చేశారు. ఓ మనిషిగా తోటి వారికి చేతనైనంత సాయం చేయాలన్నదే తన సంకల్పం అంటారు బాలాజీ. సాయం చేసే మనసుండాలే కానీ ఏదో ఒక రూపంలో సాయాన్ని అందించవచ్చు. మనసున్న మనిషిగా గుర్తింపు పొందవచ్చు.