అమ్మా.. నువు లేకపోతే నేనెలా బతకాలి.. విలపిస్తున్న పిల్ల వానరం

అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ ప్రేమని కొలవడం అసాధ్యం. తినకపోతే కొడుతుంది. తినమని వారిస్తుంది. తను తినకపోయినా బిడ్డ తింటే చాలనుకుంటుంది. ప్రేమా ఆప్యాయతలను పంచే అమ్మ దూరమైతే జంతువులైనా వాటికీ మనసుంటుంది. మనుషుల్లానే స్పందించే హృదయం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరం ఖటికపర ప్రాంతంలోని సెయింట్ జాన్స్ కళాశాల సమీపంలో ఓ కోతి తన పదిరోజుల వయసున్న పిల్ల వానరాన్ని ఎత్తుకుని రోడ్డు దాటుతోంది. అంతలో వేగంగా వచ్చిన కారు తల్లిని పొట్టన పెట్టుకుంది.

బిడ్డ కళ్ల ముందే తల్లి ప్రాణాలు కోల్పోయింది. అచేతనంగా పడిఉన్న అమ్మని చూసి ఏం జరిగిందో తెలియక అక్కడే తల్లిని పట్టుకుని కూర్చుంది. అమ్మా లే.. అంటూ తన భాషలో అమ్మని లేపింది. ఎంతకీ లేవని అమ్మను మీరైనా లేపండి అంటూ చుట్టూ చూసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న స్థానికుల హృదయం ద్రవించింది. జంతు సంరక్షణాధికారులకు కబురు చేయగా వారు వచ్చి పిల్ల వానరాన్ని తీసుకువెళ్లారు. అమ్మలేని లోటు లేకుండా పెంచాలనుకున్నారు. కొన్ని రోజులు తమ సంరక్షణలోనే ఉంచుకుని అనంతరం అడవుల్లో వదిలేస్తామని వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ సీఈవో కార్తీక్ సత్యనారాయణన్ తెలిపారు.