ఇద్దరిని దారుణంగా హత్యచేసి.. చివరకు ఇలా..

డబ్బు కోసం కిడ్నాప్‌లు చేశారు. అడిగినంత ఇచ్చినాసరే వదిలిపెట్టలేదు. ఇద్దరి ప్రాణాలు తీశారు ఆ కిరాతకులు. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు మర్డర్ కేసులను చివరికి పోలీసులు ఛేదించారు. నలుగురు కరడుగట్టిన నేరస్థులను కటకటాల్లోకి నెట్టారు.

ప్రకాశం జిల్లాలో నలుగురు నరరూప రాక్షసులు డబ్బు కోసం కిడ్నాపులు, హత్యలు చేయడం వృత్తిగా మార్చుకున్నారు. ఇద్దరిని దారుణంగా హత్యచేశారు. మరికొన్ని నేరాలకు పాల్పడ్డారు.

ఈ కిరాతక ముఠా దర్శికి చెందిన బంగారు నగల వ్యాపారి ఆదినారాయణను కిడ్నాప్ చేసి హత్య చేసింది. గిద్దలూరులో కారు డ్రైవర్‌ కేశవ్‌ను మర్డర్ చేసింది ఈ గ్యాంగ్. ఈ రెండు హత్యలు ప్రకాశం జిల్లాలో సంచలనం రేపాయి.

ఆగస్టు 14న విజయవాడ వెళ్లి వస్తున్న ఆదినారాయణను నాగమల్లేశ్వరరావు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఆదినారాయణను విడిచిపెట్టడానికి 20 లక్షలు డిమాండ్ చేసింది ఈ ముఠా. చివరికి ఆదినారాయణ మిత్రుడి ద్వారా ఐదు లక్షలు తీసుకున్నారు. అయినాసరే విడిచిపెట్టకుండా అతడిని అత్యంత దారుణంగా చంపేశారు.

ఆదినారాయణ డెడ్‌ బాడీ చివరికి ఆగస్టు 19న త్రిపురాంతకం మండలం మేడపి చెరువు సమీపంలో దొరికింది. ఈ కేసులో దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడితోపాటు ముఠా కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే వాళ్లను పట్టుకోడానికి దాదాపు 20 రోజులు పట్టింది. ఎట్టకేలకు నాగమల్లేశ్వరరావుతోపాటు అతడికి సహకరించిన గుండాల రాజశేఖర్‌రెడ్డి, మన్నం కోటేశ్వరరావు, గర్నెపూడి సురేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన నేరాల్లో వీళ్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గిద్దలూరుకు చెందిన కారు డ్రైవర్‌ కేశవ్‌ను హత్య చేసినట్లు ఈ ముఠా ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ నరరూప రాక్షసులు వ్యక్తులను కిడ్నాప్ చేసి చంపి కాల్చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.

నిందితుల దగ్గరి నుంచి 4 లక్షల రెండు వేల రూపాయల నగదు, 12 తులాల బంగారం, స్విఫ్ట్‌ కారు, ఒక బైక్, ఏటీఎం కార్డులు, 9 మొబైల్ ఫోన్లు, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ 20 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు.