రాహుల్ గాంధీ భోజనంపై దుమారం

rahul ate non veg

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భోజనంపై దుమారం రేగుతోంది. పవిత్ర మానస సరోవర యాత్రలో ఉన్న రాహుల్… చికెన్ కుర్‌కురే ఆర్డర్ చేశారని బీజేపీ నేతలు మండిపడ్డారు. పరమ శివుడికి మహా భక్తున్ని అని చెప్పుకుంటూ మానస సరోవర్‌ యాత్ర చేపట్టిన రాహుల్‌… హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానస సరోవర యాత్రలో భాగంగా గత నెల 31న రాహుల్‌… నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. అక్కడి వూటూ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. ఈ విషయాన్ని ఆ రెస్టారెంట్ యాజమాన్యం తన వెబ్‌సైట్‌లో కూడా వెల్లడించింది. అయితే రాహుల్‌ 9వ నెంబర్ టేబుల్‌పై కూర్చుని చికెన్‌ కుర్‌కురేకు ఆర్డర్ ఇచ్చారంటూ మీడియాలో వార్తలు రావడంతో బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.

గత కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాతు ఆయన క్షేమంగా బయటపడ్డారు. అయితే పరమేశ్వరుని మహిమ వల్లనే తనకు ప్రమాదం తప్పిందని… త్వరలోనే కైలాస మానససరోవర యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. అందులో భాగంగానే ప్రస్తుతం రాహుల్‌ యాత్ర చేపట్టారు. 12 రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో రాహుల్‌ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మానససరోవర సరస్సుకు చేరుకున్న ఆయన… అక్కడి జలాలు చాలా స్వచ్ఛమైనవని, ఎలాంటి కల్మషం లేనివంటూ ట్వీట్ చేశారు. శివుడి ఆజ్ఞ ఉంటేనే కైలాశ్‌కు వెళ్తామంటూ ఆయన అన్నారు. ఈ అవకాశం లభించినందుకు రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు.

యాత్రలో ఉండి రాహుల్ చికెన్ కుర్‌కురే తిన్నాడంటూ దుమారం చెలరేగడంతో వూటూ రెస్టారెంట్‌ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ రెస్టారెంట్ వెయిటర్ మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రకటించింది. రాహుల్ గాంధీ ఒక సాధారణ వ్యక్తిలాగే తమ రెస్టారెంట్‌కు వచ్చారని… శాఖాహారం మాత్రం తిన్నారని వెల్లడించింది. అయితే రాహుల్‌ చికెన్‌ కుర్‌కురే తిన్నారంటూ మీడియాలో వార్తలు రాగానే సోషల్‌ మీడియాలో హల్‌చల్ మొదలైంది. రాహుల్ చేసిన పని బాగలేదంటూ నెటిజన్లు మండిపడ్డారు. కానీ ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీగానీ, రాహుల్‌గానీ ఇంతవరకు స్పందించలేదు.