ఆరో తేదీన సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

ముందస్తుకు ముహుర్తం ఫిక్స్ అయింది. వారం, తిథి, నక్షత్రం అన్ని కలిసొచ్చిన గురువారం రోజునే అసెంబ్లీ రద్దుకు రెడీ అయ్యారు కేసీఆర్. కేబినెట్ భేటీలో తీర్మానం చేసి..ఆ తీర్మానాన్ని తానే స్వయంగా గవర్నర్ కు అందించనున్నారు. మరోవైపు టిక్కెట్లు కన్ఫమ్ అయిన నేతలకు ఫోన్లు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సూచిస్తున్నారు సీఎం.

ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ తొలి అసెంబ్లీ మరికొద్ది గంటల్లో రద్దు కాబోతోంది. ఎమ్మెల్యేలు అంతా మాజీలు కాబోతున్నారు. అదృష్ట సంఖ్యగా చెప్పుకునే ఆరో తేదిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. మధ్యాహ్నం సమావేశం కానున్న కేబినెట్..శాసనసభరద్దుపై ఏకవాక్య తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానం ప్రతిని సీఎం కేసీఆరే స్వయంగా గవర్నర్ కు అందించే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గవర్నర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

మరికొద్ది గంటల్లో జరగబోయే కేబినెట్ సమావేశం కోసం ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ముందస్తుపై మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేశారు. పరిపాలనపరంగా బుధవారమే దాదాపుగా ఆఖరు రోజు కావటంతో ఉన్నతాధికారుల బదిలీలు, కీలకమైన వారికి ముఖ్య బాధ్యతల అప్పగింతల అంశాలపై ఈ రాత్రికల్లా కసరత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి. గురువారం కేబినెట్ సమావేశం సమాయానల్లా నిర్ణయాలు వెలువడొచ్చు.