అక్కడ షర్మిల పోటీ ఉంటుందా?

ys-sharmila-political-entry-by-ongole

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపికి మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఎలాంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినా, వైయస్‌ తోడల్లుడు వై.వి. సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, ప్రాంతాలు వైసిపికి కంచుకోటల్లా మారాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో పాటు ఎస్సీ, ముస్లిం జనాభా కూడా వైసిపి వైపు మొగ్గు చూపడంతో వై.వి. గెలుపు సునాయాసంగా మారింది. అయితే ఇటీవల ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే.. అదీ వైసీపీ బలం ఉన్న ప్రాంతాలను సస్యశ్యామలం చేసే వెలుగొండ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. మొదటి టన్నెల్‌ పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికల్లా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇది ప్రజల్లో సానుకూలంగా పనిచేసి టీడీపీకి అనుకూలంగా మారితే.. ఎన్నికల్లో ఫలితం తమకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని వైసీపీ కేడర్ అంటోంది. వైసిపికి కంచుకోటలా ఉన్న ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుంది. పైగా వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరడంతో ఇక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇక బాలినేనికి, సుబ్బారెడ్డి వర్గాల మధ్య వార్ కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వైసీపీ అప్రమత్తమయింది. ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ… వైసీపీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. వైవీ సుబ్బారెడ్డి కనిగిరి నుంచి వెలుగొండ వరకూ యాత్ర చేపట్టారు. ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాజెక్టు పనులు కాలేదని.. తమ ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్ధిని కూడా మార్చాలన్న ప్రతిపాదనలున్నట్టు తెలుస్తోంది. సుబ్బారెడ్డి కాదంటే.. అంతకంటే బలమైన అభ్యర్ది ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరిగింది. అయితే వైఎస్ షర్మిల సరైన అస్త్రం అవుతారని కేడర్ చెబుతోంది. బాబాయిని కాకుండా… ఈసారికి అమ్మాయిని బరిలో దింపితే పార్లమెంట్ తో పాటు… అసెంబ్లీ కూడా స్వీప్ చేయవచ్చని అధినేతకు కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకను అధిగమించడంతో పాటు… టీడీపీని ఆత్మరక్షణలో పడేయవచ్చని చెబుతున్నారు. షర్మిల అయితే.. బాలినేని వర్గం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. వైసిపికి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులతో పాటు కనిగిరి, ఒంగోలు, కొండెపి, దర్శి నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి విజయకేతనం ఎగురవేయవచ్చన్న వ్యూహంలో వైసిపి ఉన్నట్టు తెలుస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. ఓదార్పు యాత్ర చేసిన షర్మిలను ఒంగోలు ఎంపీగా గెలిపిస్తారని కేడర్ నమ్ముతోంది. మరి జగన్ మనసులో ఏముందో? బాబాయి అమ్మాయి కోసం సీటు వదులుకుంటారా? బాబాయికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారన్నది కూడా చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -