నేటినుంచి ఎనిమిది రోజులపాటు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ap assembly meetings starts today

అసెంబ్లీ వేదికగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరోసారి ఎండగట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఎనిమిది రోజులపాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు.. రాష్ట్రప్రభుత్వ నివారణ చర్యలపై సమావేశంలో చర్చించాలని అధికారపక్షం నిర్ణయించింది. ఇదే సమయంలో కేంద్ర చేస్తున్న అరకొర సాయాన్ని సభా వేదికగా ఎండగట్టనున్నారు. అమరావతి బాండ్స్‌కి అనూహ్య స్పందన.. పోలవరం ప్రజెక్టు పురోగతి, డీపీఆర్ ఆమోదంలో కేంద్ర జాప్యంపైనా చర్చించనున్నారు.

రాష్ట్రంలో నదుల అనుసంధానానికి చేపట్టిన చర్యలను వివరించడంతో పాటు పీడీ ఆకౌంట్లపై బీజేపీ-వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, గృహనిర్మాణం, నిరుద్యోగభృతితో పాటు 1500 రోజుల పాలనా విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను సభలో చర్చించేలా తెలుగుదేశం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. వివిధ వర్గాలకు కల్పిస్తున్న సంక్షేమంతో పాటు.. పునర్విభజన చట్టాన్ని కేంద్రం నీరుగార్చిన తీరును మరోమారు సభా వేదికగా ఎండగట్టనున్నారు. కేంద్ర విద్యాసంస్థల భవనాల నిర్మాణం, ఆరోగ్యం, వైద్య సదుపాయాలు, విశాఖ భూ కుంభకోణం, భోగాపురం టెండర్ల రద్దుకు కారణాలు లాంటి అంశాలపై అధికార పార్టీ సభ్యులే ప్రశ్నలు సంధించనుండగా.. మంత్రులు సమాధానమివ్వనున్నారు.

ఇక.. ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు తాము సభకు హాజరుకాబోమని వైసీపీ ఎమ్మెల్యేలుస్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు వారంతా బహిరంగ లేఖ రాశారు. అటు.. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఉద్దేశం ప్రతిపక్షానికి లేదంటూ సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. అసలు అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఎందుకని నిలదీశారు.

సభలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకపోయినా.. బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే టీడీపీతో తెగదెంపులు చేసుకున్న కమలనాథులు… రాష్ట్రంలో భారీస్థాయిలో అవినీతి జరుగుతోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు పాలనపై అసెంబ్లీ సాక్షిగా నిలదీసేందుకు కత్తులు నూరుతున్నారు.

మరోవైపు ఉభయ సభల నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ ఫరూఖ్ కలిసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాల పంపే విషయంలో జాప్యం ఉండరాదని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు బాస్‌లను ఆదేశించారు.