హోటల్‌ గదిలో సినీ నటి ఆత్మహత్య?

సినిమాలు, టీవీ సీరియల్‌లు, పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటించిన ప్రముఖ బెంగాలీ సినీ నటి పాయెల్‌ చక్రబోర్తి మృతిచెందారు. బుధవారం రాత్రి పాయెల్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఓ హోటల్ గదిలో కనిపించారు. ఈ దారణం పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో చోటుచేసుకుంది.

చోఖేర్‌ తారా తుయ్‌, గొయెండా గిన్నీ వంటి షోలను పాయెల్ చేస్తున్నారు. ఆమె తన భర్త నుండి గత కొద్దిరోజులుగా వేరుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె మంగళవారం హోటల్‌లో ఓ గది తీసుకుంది. బుధవారం హోటల్ సిబ్బంది ఎంతగా డోర్‌ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూశారు. అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పాయెల్‌ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్‌ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్‌ గుహా వాపోయారు. పాయెల్‌కు ఓ కుమారుడు ఉన్నారు. పాయోల్‌ మృతితో పశ్చిమబెంగాల్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.