వెలుగులోకి వచ్చిన మరో స్కామ్‌.. రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు

gutkha scam in tamilanadu state

తమిళనాడులో గుట్కా స్కామ్‌ ప్రకంపనలు రాజకీయ వర్గాల్ని వణికిస్తున్నాయి. 250 కోట్ల కుంభకోణం కేస్‌ను డీల్‌ చేస్తున్న సీబీఐ అధికారులు వరుస దాడులతో స్పీడ్‌ పెంచారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్‌ లీడర్లతో పాటు ప్రభుత్వ అధికారులు హడలిపోతున్నారు.

గుట్కా స్కామ్‌పై దర్యాప్తులో భాగంగా.. చెన్నైలోని 40 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. 150 మంది బృందాలుగా విడిపోయి బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే దాడులు ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తున్న తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్‌తోపాటు, డీజీపీ రాజేంద్రన్‌, మాజీ డీజీపీ జార్జ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా సేల్స్‌ట్యాక్స్ విభాగం అధికారులు, వ్యాపారవేత్తలు నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. వీరి ఇళ్ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాట 2017 జులైలో 250 కోట్ల గుట్కా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ శాఖ మాధవరావు అనే వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, రహస్య నోటు ఆధారంగా విచారణ చేపట్టాలంటూ డీఎంకే ఎమ్మెల్యే అన్బజగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఐటీ శాఖ అధికారులు కీలక విషయాలను బయటపెట్టారు. 2016లో మాజీ సీఎం జయలలిత నివాసంలోని శశికళ గదిలో గుట్కా స్కామ్‌కు సంబంధించిన రహస్య నోటు తమ తనిఖీల్లో దొరికిందని హైకోర్టుకు తెలిపారు. ఈ నోట్‌లో ఆరోగ్యశాఖ మంత్రికి 56 లక్షల రూపాయలు ముడుపులు చెల్లించారని… అలాగే పోలీస్ కమిషనర్లకు సైతం లంచం చెల్లించినట్లు వివరాలున్నట్లు చెప్పారు. దీంతో గుట్కాస్కామ్‌పై మద్రాస్‌ హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు 2018 మే 30వ తేదీన తమిళనాడు ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, రాష్ట్ర ఫుడ్‌ సేప్టీ అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 2013 నుంచి తమిళనాడులో క్యాన్సర్‌ కారకాలైన గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది.