గ్యారేజ్ నుండి రారాజు గా ….!

“రాబోయే భవిష్యత్తులోకి తొంగి చూడటం అలవాటు చేసుకోండి… భవిష్యత్తు వర్తమానం అయినపుడు విజయం మీ ముంగిట నిలుస్తుంది.” ఈ మాట ఏ ఆషామాషి వ్యక్తో అన్నది కాదు . ఫోర్బ్స్ జాబితాలో దిగ్గజాలను తోసి రాజని… రారాజుగా మారిన అమెజాన్ కంపెనీ అధినేత జెఫ్ బెజో అన్న మాటలివి. అమెరికా బహుళ జాతి సంస్థ అయిన అమెజాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక సంస్థగా ఎదిగింది. ఈ సంవత్సరం అమెజాన్ షేర్లు అనూహ్యంగా పుంజుకోడంతో… ఏకంగా 166 బిలియన్ డాలర్ల( సుమారు రు. 11.3 లక్షల కోట్ల) సంపదకు  జెఫ్ బెజో అధిపతిగా మారారు.

Image result for jeff bezos

విజయానికి బెజో చెప్పే మార్గం
సవాళ్ళు, ప్రతి సవాళ్ళను ఎదుర్కొంటూ విజయానికి కావాల్సిన శ్రమను సమకూర్చుకోవడం , మార్చుకోవాల్సిన విషయాల్లో వెనక్కితగ్గకపోవడం.. వంటివి జెఫ్ బేజోను అందరికంటే ముందు వరుసలో నిలబెట్టాయి. మీలో చురుకుదనం, బలం ఉంటేనే..మీరు విజయానికి అర్హులంటాడు బెజో. సరికొత్త ఆవిష్కరణలు, తీసుకున్న నిర్ణయాల అమల్లో వేగం ఇవే తమ కంపెనీ పురోభివృద్ధికి మూలకారణాలని చెబుతాడు జెఫ్ .

ఇలా మొదలైంది

జెఫ్రీ ప్రీస్టన్ బెజో జనవరి 12, 1964 న  న్యూ మెక్సికో లోని ఆల్బుకర్ లో జన్మించాడు.  తల్లి అంటే విపరీతమైన ప్రేమ గల జెఫ్ తన తల్లి పడ్డ కష్టాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటునే ఉంటాడు. తన బాల్యాన్ని ఎక్కువగా తాత గారిల్లు అయిన టెక్సాస్ లోనే గడిపేవాడు . బెజో తాత US అటామిక్ ఎనర్జీ కమీషన్ లో పనిచేసేవాడు. బెజో తన గ్రాడ్యుయేషన్ ని కంప్యూటర్ సైన్స్‌లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో పూర్తి చేసి  వాల్ స్ట్రీట్ లో పని చేశాడు. 1990లో ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ అయిన D.E. షా నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేసి బయటకు వచ్చాడు జెఫ్. ఆ తరువాత నాలుగేళ్ళకు ఆన్ లైన్ బుక్ సెల్లర్ గా అమెజాన్ డాట్ కాం ను చిన్న అంకుర సంస్థగా స్థాపించాడు. అదీ  సీటెల్ శివారు ప్రాంతంలోని ఓ చిన్న గ్యారేజ్ లో తన కంపెనీని ప్రారంభించాడు.  తన తల్లిదండ్రుల వద్ద నుండి అప్పుగా డబ్బులను తీసుకుని కంపెనీని నడిపించాడు జెఫ్. బుక్స్ ఆన్ లైన్ వ్యాపారం నుంచి క్రమంగా పలు రంగాలను విస్తరించాడు . అమెజాన్ కంపెనీని రిటైల్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టాడు.

Image result for jeff bezos

టెక్నాలజీ రూట్‌లో

స్వతహాగా సైన్స్ ఫిక్షన్ నవలలను ఇష్టపడే జెఫ్ తన అభిరుచికి అనుగుణంగా బ్లూ ఆరిజిన్ అనే ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు. అంతరిక్షయానం.. చంద్రమండల యాత్రలు  ఈ బ్లూ ఆరిజిన్ ప్రధాన లక్ష్యాలు. అంతేకాకుండా… టెక్సాస్ సమీప పర్వతంపై ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్ నిర్మించడానికి దాదాపు 42 మిలియన్ డాలర్లను వెచ్చించాడు జెఫ్. పది వేల సంవత్సరాల పాటు కాలం గణించడానికి 150 మీటర్ల క్లాక్ ను నిర్మించనున్నారు. దీనికి జియో థర్మల్ ఎనర్జీని వాడనున్నారు.
1993లో జెఫ్  మెకంజీ బెజోస్ ను వివాహమాడారు. ఆయనకు నలుగురు పిల్లలు. వ్యాపార రంగంలో దూర దృష్టి ఉండాలనే జెఫ్ తన వ్యాపార విస్తరణలో ప్రత్యర్ధులకు ఊహకందని వేగంతో దూసుకెళ్ళేవాడు. అదే అతనిని ప్రపంచ టాప్ కుబేరుడిగా నిలబెట్టింది.  చిన్ననాటి నుండి వైజ్ఙానిక ఆసక్తి ఎక్కువగా కల జెఫ్ బెజోస్ రానున్న రోజుల్లో మరిన్ని నూతన ఆవిష్కరణలతో తన వ్యాపారాన్ని విస్తరించడాన్ని మనం చూడొచ్చు.