తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఆయన దర్శకత్వంలోనే..

బాహుబలి తర్వాత ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రావడంతో… రాబోయే చిత్రాల్ని అంతే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న సాహో చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మించేందుకు గోపికృష్ణా మూవీస్ ప్లాన్ చేస్తోంది.

జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన కే కే రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రం లో ప్రభాస్ సరసన నటించనుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస… ప్రొడక్షన్ డిజైనింగ్ లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్…. తనదైన షార్ప్ ఎడిటింగ్ తో ఎన్నో అద్భుతమైన హిట్స్ లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండనుంది.