విద్యార్థినిల ఫోన్‌లకు అసభ్య మెసేజ్‌లు పెట్టిన బ్యాడ్‌ టీచర్‌

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. అదే పిల్లలకు గురువు.. విద్యాబుద్దులు నేర్పించి మంచిపౌరులుగా తీర్చిదిద్దుతాడు. అందుకే తల్లిదండ్రులతో పాటు గురువును కూడ గౌరవిస్తారు విద్యార్ధులు. చివరికి దేవుడు కూడ గురువు గారి పాదాలకు నమస్కరిస్తాడు. గురువుకు అంతటి సమున్నత స్థానమిస్తాము కనుకనే ఉపాధ్యాయదినోత్సవం చాలా గొప్పగా నిర్వహిస్తాము. అయితే.. అటువంటి పవిత్రమైన రోజున ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్ధినిని లైంగికంగా వేధించడంతో ..బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు,బంధువులు ఆ నీచుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

కాకినాడ కరణంగారి సెంటర్‌లో ఉన్న ఓ పాఠశాలలో ప్రకాష్‌ అనే ఇంగ్లీష్‌ టీచర్‌ పనిచేస్తున్నాడు. అయితే.. విద్యార్ధినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇతనిని స్కూల్‌ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే.. ఈఘటన తర్వాత కూడ అతని నీచ బుద్ది మారలేదు. పాఠశాలలో ఉన్న విద్యార్ధినిల ఫోన్‌ నంబర్లు సేకరించి వారికి అసభ్య సందేశాలు పంపడం ప్రారంభించాడు. అంతటితో ఊరుకోకుండా విద్యార్ధినిల ఫొటోలు సేకరించి తిరిగి వారికే పంపించాడు. కొందరు విద్యార్ధినిలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవాలని ప్రయత్నించడంతో బాధిత విద్యార్ధినిలు వారి తల్లిదండ్రులకు సమాచారమందించారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్ధినిల తల్లిదండ్రులు సదరు కీచక టీచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.