అధిపత్య పోరులో చతికిలపడ్డ అళగిరి

war-between-stalin-and-alagiri

ద్రవిడ ఉద్యమ సూరీడు కరుణానిధి కన్నుమూసి.. నెల కూడా తిరక్కముందే డీఎంకేలో వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. కరుణ మరణం తర్వాత స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో రగిలిపోయిన అళగిరి.. తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. వాటికి స్టాలిన్‌ ఏమాత్రం స్పందించకపోవడంతో.. అళగిరి తన మద్దతుదారులతో చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టారు. అళగిరితో పాటు ఆయన మద్దతుదారులు నలుపురంగు దుస్తులు ధరించి… ట్రిప్లికేన్‌ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణ సమాధి వరకు ప్రదర్శనగా వెళ్లారు. కొద్దిదూరం కాలినడకన వెళ్లిన ఆయన.. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

పెద్ద కొడుకు అళగిరి అంటే కరుణానిధికి ఎంతో ప్రేమ. అయితే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయన్ను పార్టీ నుంచి రెండుసార్లు బహిష్కరించారు. 2001లో డీఎంకే నుంచి తప్పుకున్న అళగిరి.. 2008లో తిరిగి పార్టీలో చేరి కరుణానిధికి చెప్పినట్లు నడుచుకున్నారు. 2014లో మరోసారి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అళగిరికి ఉద్వాసన పలికారు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీలోకి తీసుకోలేదు. ఇక తండ్రి మరణం తర్వాత గొంతు పెంచిన అళగిరి తనను పార్టీలోకి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తమ్ముడు స్టాలిన్‌కు హెచ్చరికలు పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు తమ్ముడిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తానని.. ఆయన నాయకత్వంలో పనిచేస్తానని రాజీకొచ్చారు. ఇంత జరిగినా డీఎంకే నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో చెన్నైలో శాంతియుత ర్యాలీ చేపట్టారు.

మరోవైపు అన్నదమ్ముల అధిపత్య పోరులో అళగిరి చతికిలపడ్డట్లు కనిపిస్తోంది. డీఎంకే కార్యకర్తలను స్టాలిన్‌ అదుపులో పెట్టడంతో.. చెన్నైలో అళగిరి ర్యాలీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ర్యాలీకి ఎవరు హాజరుకావద్దంటూ డీఎంకే హెచ్చరించడంతో కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దీంతో అళగిరి కేవలం తన సానుభూతిపరులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. కాగా.. అళగిరి ర్యాలీ సందర్భంగా నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.