సాయం చేయకుండా సత్కారాలెందుకు సార్.. సీఎంని నిలదీసిన క్రీడాకారిణి

మారు మూల గ్రామాలు.. అరకొర సౌకర్యాలు.. అయినా ఆట పట్ల మక్కువ. ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులన్నా.. కోరిక నిలువనీయదు. ఎలా అయినా ఆడాలన్న పట్టుదల పడుకోనివ్వదు. వెరసి పతాక పట్టికలో ముందు వరుసలో తమ పేరు. అంతవరకు తమ పేరు కూడా తెలియని ఊరి ప్రజలకు దేశంలోనే తమ పేరు మారుమ్రోగేలా చేస్తారు క్రీడాకారులు. దేశ గౌరవ ప్రతిష్టలను నలుచెరగులా విస్తరింపజేస్తారు.

వెల్లువెత్తుతున్న సన్మానాలు, సత్కారాల నడుమ కళ్లలో నీళ్లు, మెడలో పూలదండలతో తాము పడ్డ బాధ కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. అవసరమైనప్పుడు సాయం చేయకుండా ఈ సన్మానాలు, సత్కారాలు ఎందుకంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని ప్రశ్నించింది క్రీడాకారిణి దివ్య కక్రణ్. ఏషియన్ గేమ్స్- 2018 రెస్ట్‌లర్ గేమ్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన దివ్య మంగళవారం (సెప్టెంబర్ 4) ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంది.

ప్రభుత్వం ముందు నుంచి సపోర్ట్ ఇచ్చి వుంటే తాను బంగారు పతకాన్ని సాధించి ఉండేదాన్నని సన్మాన కార్యక్రమంలో సీఎంని నిలదీసింది దివ్య. తాను కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆడినప్పుడు భవిష్యత్తులో అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం.. ఆ తరువాత ఒక్క ఫోన్ చేసినా పట్టించుకోలేదని వాపోయింది. ఈ రోజు అవార్డులు, రివార్డులు ఇస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.