సామాన్య ప్రజలకు లబ్ది చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి కీలక నిర్ణయాలు

andhrapradesh-cabinate-taken-key-decisions

సుదీర్ఘంగా సాగిన మంత్రి వర్గ సమావేశంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలకు లబ్ది చేకూర్చుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంతోపాటు, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వేతనాలు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 30 వేల మంది హెల్త్‌ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రకృతి విపత్తులతో ఇళ్లు కోల్పోయిన గిరిజినులకు పక్కా ఇళ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలుగుదేశం ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు కానుండగా.. ఈనెల 14 నుంచి ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించింది. పెన్షన్లు పొందే వారి పిల్లలకు సైతం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ విధానంపై శాసనసభ, శాసన మండలి సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహించనుంది. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ఉపకరించే ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్ సైట్‌ను రియల్ టైమ్‌లో మంత్రి వర్గం పరిశీలించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఒక వాయిదా కరువు భత్యం చెల్లించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. డిఏ చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వంపై 627కోట్ల భారం పడనుంది. జీవోనంబర్ 151 ప్రకారం పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వేతనాలు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నగర పంచాయితీల్లో 2వేలు, పురపాలికల్లో వెయ్యి చొప్పున పెంచింది. వేతనాల పెంపు నిర్ణయంతో 30వేల మంది హెల్త్ వర్కర్స్ కు లబ్ది చేకూరనుంది. సెమి పర్మినెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద పొందిన ఇళు్ల శిథిలావస్థలో ఉంటే వారికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రాం కింద షరతులకు లోబడి ఇళ్లు కేటాయించే ప్రతిపాదనకు మంత్రి వర్గం జెండా ఊపింది. కొత్తగా 15వేల గృహాలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఓడరేపులను అభివృద్ధి చేయడానికి, అడ్మిన్‌స్టేషన్‌ వ్యవహారాలు చూసేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదాకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కృష్ణపట్నం పోర్టు ఎక్స్ క్లూజివ్ లిమిట్స్‌ను సవరించాలన్న ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. అలాగే మచిలీపట్నంపోర్ట్ లిమిటెడ్ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో సబ్ రూల్స్ మార్చాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపింది. విజయవాడ సింగపూర్ మార్గంలో ఇండిగో సంస్థ వారానికి 2 విమానాలు నడిపేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఆక్వా రైతులకు యూనిట్‌కు రెండు రూపాయలు చొపున విద్యుత్ టారిఫ్ రాయితీని ఏడాది పాటు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఐటీడీఏలో పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపిన కేబినెట్.. డెంటల్ ఇన్‌స్టిట్యూట్లకు అటానమస్‌ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.