తెలంగాణ భవన్‌లో సందడి.. బాణాసంచా కాల్చి పండుగ

celebrations in telangana bhavan

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌.. వెనువెంటనే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి దూకుడు కంటిన్యూ చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటించడమే కాకుండా.. గురువారం సాయంత్రమే వారితో తెలంగాణలో భవన్‌లో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని పార్టీ అభ్యర్థులకు కేసీఆర్‌ సూచించారు. 31 జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని.. నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని కేసీఆర్‌ అన్నారు. ప్రతి ఊరు, తండాలను వదలకుండా పర్యటనలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఏయే అంశాలపై ఫోకస్‌ చేయాలో.. ప్రచార వ్యూహాలను ఎలా రచించాలో అభ్యర్థులకు సూచించారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు. ఇవాళ్టి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థులకు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయాలని.. టికెట్‌ వచ్చిందని గర్వపడొద్దని సూచించారు. నియోజకవర్గంలోని అన్నిస్థాయిల్లో నేతలను కలుపుకోవాలన్నారు. తాను ప్రతీ నియోజకవర్గానికి వస్తానని.. ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. అసంతృప్త నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే బుజ్జగించాలని సూచించారు. మరో సమావేశంలో కలుద్దామని అభ్యర్థులకు కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ ఆదేశాలతో నియోజవర్గాలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు.. ఈరోజు నుంచే ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

మరోవైపు కేసీఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణ భవన్‌లో సందడి నెలకొంది. అభ్యర్థులు, వారి అనుచరులు బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.