విపక్షాల తీరుపై చంద్రబాబు నిప్పులు

విపక్షాల తీరుపై అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.. ప్రాజెక్టులకు సహకరించడకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ బెట్టుచేస్తోంది.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషం చిమ్ముతోందని.. అప్పడప్పుడూ తెరపైకి వచ్చి విమర్శలు చేసే జనసేనాని జాడే లేకుండా పోయారంటూ చంద్రబాబు మండిపడ్డారు.. రాష్ట్రంలో కరువుపై జరిగిన చర్చలో రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రగతిని ఆయన వివరించారు.

తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఎమ్మెల్యేలకు వివరించారు సీఎం చంద్రబాబు. ఈ నెల 12న పోలవరం గేట్‌వాక్‌కు సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులంతా వెళ్లాల్సిన గేట్‌ వాక్‌ దగ్గర పరిస్థితిని ఆన్‌లైన్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు చంద్రబాబు..

ప్రాజెక్టు పురోగతిపై ఆనందం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి కేంద్రం పెద్దగా సహకరిండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు సైతం.. పోలవరంపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రైతులను రెచ్చగొడుతున్నారని. మరోవైపు కోర్టులో కేసులు వేసి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు..

కొత్తగా వచ్చిన నాయకుడు పవన్‌ కళ్యాణ్ సైతం అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి తీరుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై జరిగిన చర్చలో ఎవరూ భయపడాల్సిన అసవరం లేదన్నారు చంద్రబాబు.. నూటికి నూరు శాతం కరువును ఎదుర్కొంటామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో జరిగిన మైనింగ్‌ బ్లాస్ట్‌లపై మంత్రి సుజయ కృష్ణ రంగారావు సమాధానం చెప్పారు. మైనింగ్‌ సేఫ్టీ తమ పరిధిలో లేదని, హైదరాబాద్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైనింగ్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఉంటుందని వివరణ ఇచ్చారు. అయినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..

సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా అనేక విషయాలపై మంత్రులను ఎమ్మెల్యేలు నిలదీశారు. రాష్ట్రంలో చుక్కల భూముల వివాదం, విశాఖ భూ కుంభకోణంపై వాడీవేడి చర్చ జరిగింది. 22-ఏ నిషేధ జాబితాపై ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖలో 4వేల కోట్ల రూపాయల భూకుంభకోణంపై సిట్‌ దర్యాప్తు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని విష్ణు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమాధానమిచ్చారు. రాబోయే కేబినెట్‌ సమావేశంలో సిట్‌ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. మొదటి రోజు సభలో వాజ్‌పేయికి నివాళులర్పించిన అసెంబ్లీ.. రెండో రోజు నందమూరి హరికృష్ణ మృతిపై సంతాపం ప్రకటించి.. నివాళులర్పించింది. ఆయనతో పాటు ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులు, వారి బంధువుల మృతికి సంతాపం వ్యక్తం చేసి.. కాసేపు మౌనం పాటించారు.