సినీ నటుడికి షాక్ ఇచ్చిన కేసీఆర్

cm kcr give shock to babumohan

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తొలి ప్రభుత్వం రద్దయింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ మంత్రివర్గం ఏకగీవ్ర తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వం అధికారికంగా రద్దయింది.

ముందస్తు ఎన్నికలకు వెళ్తే తిరుగులేని విజయం తథ్యమని భావించిన కేసీఆర్‌.. అసెంబ్లీని రద్దు చేసినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం జరిగింది. మూడు, నాలుగు నిమిషాల్లోనే ఫార్మాలిటీ ముగిసింది. అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. కరెక్ట్‌గా అనుకున్న సమయానికి దానిపై సంతకం చేశారు కేసీఆర్. నేరుగా గవర్నర్‌ దగ్గరకు వెళ్లి ఆ తీర్మానం ప్రతిని అందించారాయన. నరసింహన్‌తో దాదాపు 25 నిమిషాలు సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కారణాలను వివరించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్‌ను కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ అసహనంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌ వివరించారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సేనంటూ నిప్పులు చెరిగారు. నెహ్రూ హయాం నుంచి తెలంగాణకు ద్రోహం చేశారన్న కేసీఆర్.. రాహుల్‌ను దేశంలోనే అతిపెద్ద బఫూన్‌గా అభివర్ణించారు.

అసెంబ్లీని రద్దు చేసి ప్రతిపక్షాల వ్యూహాలకు అందనని రుజువు చేసిన కేసీఆర్‌.. అభ్యర్థుల ప్రకటనలోనూ అందరికీ షాకిచ్చారు. ఏకంగా 105 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ముందునుంచీ చెప్తున్నట్టు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ మరోసారి అవకాశం కల్పించగా.. ఇద్దరికి మాత్రం నిరాకరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో బాబూమోహన్‌కు షాక్‌ తప్పలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓదేలుకు మొండిచెయ్యి ఎదురైంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు ఆ స్థానం కేటాయించారు. మరో ఐదు నియోజకవర్గాలు మేడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్‌ తూర్పులో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు కేసీఆర్‌.

దాదాపు 9 నెలల ముందుగా అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. రాష్ట్రపతి పాలన విధిస్తారా.. అనే సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్‌. తాను CECతో మాట్లాడానని.. సుప్రీంకోర్టు తీర్పులు సైతం వీలైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలని ఉన్నాయని.. దీంతో అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి.. డిసెంబర్ మొదటి వారానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4 సంవత్సరాల 3 నెలల 4రోజులపాటు అధికారంలో ఉంది. ఇప్పుడు శాసనసభ రద్దు కావడంతో 119 మంది ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోయి మాజీలుగా మారారు. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపద్ధర్మ మంత్రిమండలి కొనసాగుతుంది. అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.