కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఈసీ రావత్

op rawat

తెలంగాణలో ముందస్తు నగారా మోగడంతో ఇటు రాజకీయ పార్టీలతో పాటు.. అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఎన్నికల నిర్వహణ తేదీని నిర్ణయిస్తామన్న ఈసీ… కేసీఆర్‌ స్వయంగా షెడ్యూల్‌ ప్రకటించడాన్ని ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీ మంగళవారం హైదరాబాద్‌కు రానుంది. మరోవైపు.. ఎన్నికలు అంత హడావిడిగా నిర్వహించాల్సిన అవసరం ఏంటని… సీపీఐ నాయకులు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

ముందస్తు నగరా మోగిన తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, మౌలిక వసతులను బేరీజు వేసుకున్నాకే ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తామని… సీఈసీ ఓపీ రావత్‌ తెలిపారు. వాస్తవానికి మార్చి వరకు ఎలక్షన్స్‌కు సమయం ఉన్నా…. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో… ప్రక్రియను వీలైనంత త్వరగానే ప్రారంభించేందుకు చూస్తామన్నారు.

అటు ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ఉంటుందన్నది కేసీఆర్‌ ప్రకటించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణలో హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సీపీఐ నాయకులు సీఈసీ ని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంతో మిలాఖత్‌ అయినందునే కేసీఆర్‌ ఇలా ప్రకటించారంటూ… నారాయణ మండిపడ్డారు..

అటు ఎన్నికల సంఘం కూడా కేసీఆర్ వైఖరిని తప్పుబట్టింది. సీఈసీని సంప్రదించకుండా… రాజకీయ నాయకులు తేదీలు ప్రకటించడం మంచి సంస్కృతి కాదని విమర్శించారు. ఎవరో అన్నారని తేదీలు మారబోవని.. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఎన్నికలు నిర్వహిస్తామని రావత్‌ తెలిపారు.

మరోవైపు.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం… తెలంగాణ ఎన్నికలపైనా చర్చించింది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ నెల 11 న హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాన్ని పంపాలని సీఈసీ నిర్ణయించింది. సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా నేతృత్వంలో బృందం.. తెలంగాణలో ఎన్నికలకు ఉన్న అవకాశాలను, పరిస్థితులను పరిశీలించనుంది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల తేదీని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.