భయపడుతూ చేసిన పాత్రే అవార్డులు తెచ్చిపెట్టింది: జయసుధ

కొన్ని పాత్రలు కొంతమంది నటులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సృష్టిస్తారు దర్శకులు. ఇలాంటి పాత్ర తాము చేయలేమంటే కూడా దర్శక నిర్మాతలు ఒప్పించి మరీ యాక్ట్ చేయిస్తుంటారు. అలాంటి పాత్రే ఒకటి జయసుధని వరిస్తే పాత్రని గురించి తెలుసుకున్న ఆమె తాను నటించలేనంటూ దర్శకుడికి తెగేసి మరీ చెప్పిందట. కానీ దర్శకుడు లేదమ్మాయి నువ్వయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తావు. తప్పకుండా నువ్వే చేయాలి.

నీకు ఇది చాలా మంచి పేరు తీసుకువస్తుంది అంటూ ధైర్యాన్ని, భరోసాని ఇచ్చారు ప్రేమాభిషేకం సృష్టికర్త దాసరి నారాయణరావు. అందులో గ్లామర్ మరియు అందం కలబోసిన తార శ్రీదేవి, నటుడు నాగేశ్వరరావు హీరో హీరోయిన్లు. అయితే వేశ్యపాత్రలో ఏ మాత్రం మేకప్ లేని పాత్ర జయసుధది. దాసరిమీద గౌరవంతో భయపడుతూనే ఆ సినిమాను పూర్తిచేసింది జయసుధ. ప్రేమాభిషేకం విడుదలై ప్రభంజనాన్నే సృష్టించింది.

పాటలు, కథా కథనం, నటీనటుల అభినయం, ముఖ్యంగా జయసుధ, నాగేశ్వరరావు పాత్రలు, శ్రీదేవి గ్లామర్ అన్నీ కలిసి సినిమాను పతాకస్థాయికి చేర్చాయి. సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని జయసుధ నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. అందుకే సహజనటి అనిపించుకుంది.