చిన్న నటులతో పెద్ద ప్రయత్నం.. కంచెర పాలెం సక్సెస్‌కు కారణం: మూవీ రివ్యూ

కంచెరపాలెం:
ఒక సినిమా రిలీజ్ కి ముందు పరిశ్రమ మొత్తం సినిమాని ప్రశంసలతో ముంచెత్తటం ఈ మద్య కాలంలో జరగలేదు. ఇలాంటి అరుదైన అనుభవం సొంతంచేసుకున్న కంచెరపాలెం. రిలీజ్ కి ముందే మంచి సినిమాగా ముద్రను వేసుకోగలిగింది. మరి ఈ కంచెరపాలెం కథేంటో చూద్దాం.
కథ:
49 సంవత్సరాలు మీదపడినా రాజుకి పెళ్ళి అవదు. అటెండర్ గా పనిచేసే అతని ఆఫీస్ కి అధికారి గా వచ్చిన ఒక మద్య వయస్కురాలు ఇతన్ని ఇష్టపడుతుంది. నాలుగో క్లాస్ చదివే సుందరం తన క్లాస్ మెంట్ సునీత అంటే ఇష్టం. బార్ షాప్ లో పనిచేసే గడ్డం పేరుతో పిలిపించుకునే కుర్రాడు సలీమ ను ఇష్టపడతాడు. జోసఫ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భార్గవి ప్రేమించుకుంటారు. ఈ నాలుగు ప్రేమకథలకు కుల మతాలు, సమాజం లోని అంతరాలు అడ్డు గోడలుగా మారతాయి. మరి ఈనాలుగు ప్రేమకథలు సుఖాంతం అయ్యాయా..?

ఈ నాలుగు కథలకు ఏదైనా కనెక్షన్ ఉందా అనేది మిగిలిన కథ..
సహాజత్వానికి తెలుగు సినిమా చాలా దూరం ఉంటుంది. కాసేపు వినోదం,కాసేపు హీరోయిజం అక్కడా అక్కడా ఏమోషనల్ సీన్స్ అనే లెక్కల్లో చాలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళే రాబట్టాయి. కానీ తెలుగు సినిమా తీరు తెన్నులు మారుతున్నాయి. అలా మారుతున్న తెలుగు సినిమా మేకింగ్ లో పెద్ద కుదుపు గా కంచెర పాలెం గా మారింది. పరిశ్రమ నడతను మార్చే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన ప్రయత్నమే కంచెర పాలెం. తొలి సినిమా దర్శకుడిగా మహా వెంకట్ వేసిన ముద్ర చాలా రోజు లు వెండితెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. కంచెర పాలెం విషయానికి వస్తే ఈ సినిమా మేకింగ్ నిజంగా సర్ ప్రైజ్ చేస్తుంది. కథలుగా చదివిన ఫీల్ సినిమా గా మార్చడం చాలా కష్టం.

ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కంచెరపాలెం లో మకాం వేసిన వెంకటేశ్ మహా తెలుగు సినిమాకి ఆడియన్స్ కి చేరేందుకు కొత్త దారిలో ప్రయాణం చేసాడు. ఈ ప్రయాణంలో అతనికి స్టార్స్ అండదండలు లేవు, పేరుమోసిన టెక్నీషియన్స్ లేరు. కమర్షియల్ ఫార్మెట్ లు లేవు. అతని దగ్గర ఉన్నది మనసుకు హాత్తుకునే కథలు.. ఆకథలకు ఇమిడిపోయే నటీ నటులు ఆ కథను అర్ధం చేసుకొని పనిచేసే టక్నీషియన్స్. వీటితోనే మహా తెలుగు సినిమా మేకర్స్ మనసులతో పాటు ప్రేక్షకులు మనసులు గెలిచాడు. రిలీజ్ కి ముందే ఒక సినిమాని తెలుగు సినిమా ప్రముఖులంతా స్వచ్ఛందంగా భుజాన వేసుకునేంత ప్రభావం చూపాడు దర్శకుడు. గొప్ప కథలుగా చెప్పుకునేందుకు కంచెర పాలెం కథలో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ లు ఏమీ ఉండవు.

49 సంవత్సరాలు దాటినా పెళ్ళి కాని రాజు పాత్ర కంచెర పాలెంలో మొదట పరిచయం అవుతుంది. రాజు ఒక గవర్నెమెంట్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తుంటాడు. పెళ్ళికానీ రాజు అంటే ఊరిలో అందరికీ చులకనే, కనపడిన ప్రతివాడు ఆ విషయం మీద అతన్ని ఆటపట్టిస్తుంటారు. ఈ రాజు పనిచేసే ఆఫీస్ కి ట్రాన్సఫర్ మీద వచ్చిన ఒక లేడీ ఆఫీసర్ అతనంటే ఇష్టం ఏర్పడుతుంది. ఒక జోసఫ్ ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు.. కొట్లాట్లకు ముందుండే వాడు. భార్గవి అతని జీవితంలోకి వచ్చాక అతనికి జీవితం అంటే కాస్త బాధ్యత తెలిసొస్తుంది. మరో గడ్డం గాడు బార్ షాప్ లో పనిచేసే ఇతనికి రోజు తన పనిచేసే షాప్ ముందు నిలబడి మందు కొనుక్కునే అమ్మాయి అంటే ఇష్టం.

కానీ ఆ అమ్మాయి మోహం చూపించదు. వీడు ఆ అమ్మాయి కోసం తెగ తిరుగుతుంటాడు. వేశ్య ని ప్రేమించానని తర్వాత తెలుస్తుంది. చివరోడు చిన్నడు సుందరం తనతో నాలుగో క్లాస్ చదివే సునీత్ అంటే ఇష్టం. ఆ ఏజ్‌లో ఇష్టానికి, ప్రేమకు తేడా తెలియని సుందరం సునీత కోసం చాలా పెద్ద తప్పు చేస్తాడు జీవితంలో .. ఇవి వెంకటేష్ మహా కంచర పాలెం లో ఎంచుకున్న కథలు. ఆ ఊరి వారితో కలసి పోయిన మహా అక్కడ నుండే ఆర్టిస్ట్ లను తీసుకున్నాడు. రాజు క్యారెక్టర్ చేసిన సుబ్బారావు కంచెర పాలెం అత్యంత ఇష్టపడే పాత్రగా మారింది. అతని నటన, సిగ్గు పెళ్లి కాలేదనే అసహానం, ఊరి వాళ్ళు చులకన చేస్తున్నారనే ఉడుకుబోతు తనం అన్నీ ఆ పాత్రలో సహాజంగా పలికాయి. తెలియకుండా ఆ పాత్ర ను ఇష్టపడతాం. థియేటర్ దాటాక కూడా ఆ పాత్ర చాలా రోజులు మనతోనే ఉంటుంది.

మిగిలిన కథలలో జాతి వివిక్షతలు, కులమతాల పట్టింపులు అన్నీ సహాజంగా పొందు పరిచాడు దర్శకుడు. అలాంటి కథే జోసఫ్ బార్గవిలది. ఈ ప్రేమకథ ను పోలిన ప్రేమలు ప్రతి చోట కనిపించేవే కానీ ప్రేమించిన అమ్మాయిలో చూసే తెగింపు మాత్రం బార్గవి పాత్రలో చాలా ప్రభావవంతంగా కనపడింది. పల్లెటూరి అమాయకత్వం అణు అణువునా నింపుకున్న పాత్ర గడ్డం పేరుతో పలికే పాత్రది ఆ పాత్రకు ప్రాణం పోసాడు మోహన్ భగత్. తను ప్రేమించిన అమ్మాయి వేశ్య అని తెలిసిన తర్వాత అతను పలికించిన హావభావాలు మనసులోకి చొచ్చుకుపోతాయి. ఇలాంటి ప్రేమకథలే కాదు కష్టాన్ని నమ్ముకొని సొంతంగా బతుకుదామని ప్రయత్నించే పాత్ర కిషోర్ .

సినిమా లో కన్నీళ్లు తెప్పించే సందర్భాన్ని కలిపించిన పాత్ర కూడా ఇదే. అందుకే కిషోర్ శ్రమకు గౌరవంగా నిలబడతాడు. ఇలాంటి కథలకు బలంగా మారింది మాత్రం స్వీకర్ అగస్తి. తను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంచెర పాలెం కథలకు ఒక మూడ్ ని సెట్ చేసింది. లోకల్ గా ఉండే టాలెంట్ ని వాడుకుంటూ అక్కడ కథలను ముడి సరుకుగా మలిచి వెంకటేశ్ మహా చేసిన ప్రయత్నానికి భేష్ అనాల్సిందే. టాలెంట్ అంటే దిగుమతి సరుకు అనుకోకుండా మన ముడి సరుకుకు సాన బెట్టి వెండితెరమీద మేరిసే కథను తయారు చేసాడు.

ఈ ప్రయత్నానికి తొలి అడుగు వేసిన నిర్మాత పరుచూరి ప్రవీణ కి అభినందనలు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే కలెక్షన్స్ మాత్రమే మిగిలిన రోజుల్లో ఆర్టిస్టిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే సందర్బం కంచెర పాలెంతో కల్పించింది. తెలుగు సినిమాలలో సహాజంగా అనిపించే కథలలో కంచెర పాలెం అగ్రస్థానంలో నిలబడుతుంది. చందమామకథలు, మనమంతా తరహా కథనం అనిపించినా ఇది పూర్తి సహజంగా రూపొందడం, ఆర్టిస్ట్ ల నటన కంచెరపాలెం ను మరింత మనసుకు హత్తుకునేలాచేసాయి.
చివరగా:
కంచెరపాలెం తెలుగు సినిమాకి కొత్త దారిని చూపించింది.