అమ్మ తలకు ఎక్కువ నూనె పెట్టిందని.. బిల్డింగ్‌పై నుంచి దూకి..

చిన్న చిన్న విషయాలకే ఆవేశపడిపోతున్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కక్షణం కూడా ఆలోచించలేకపోతున్నారు. చిన్న పిల్లలు సైతం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర థానేకు చెందిన 13 ఏళ్ల విజయ భోయిర్‌ స్కూలుకు వెళుతూ అమ్మతో జడ వేయించుకుంటోంది. తల్లి బిడ్డ తలకు నూనె పెట్టి జడ వేసే క్రమంలో కొద్దిగా నూనె ఎక్కువ పెట్టింది. దాంతో ఎందుకు అంత నూనె పెట్టావని తల్లి మీద అలిగి బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకేసింది. వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కన్నబిడ్డ కళ్లముందే అలా విగత జీవిగా రక్తం మడుగులో పడి ఉండడాన్ని తల్లి జీర్ణించుకోలేకపోతుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.