అక్రమ సంబంధానికి గోత్రాలతో పనేంటి?.. సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్‌

minister nara lokesh fire on central govt

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వం గడువు తీరకముందే రద్దవడం బాధేసిందన్నారు… ఏపీ మంత్రి నారా లోకేష్‌. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై మీడియాతో మాట్లాడిన లోకేష్‌…. టీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో కొత్తదనం ఏమీ ఉండబోదన్నారు. తమ ఎమ్మెల్యే ఇతనే అని ప్రజలకు గుర్తు చేయడం తప్ప ఇంకేమీ ఉండదని సెటైర్‌ వేశారు. ముందస్తుకు వెళ్లిన కేసీఆర్‌ ప్రజలకు ఏం చెప్పుకుంటారని.. ఫలానా పని చేశామని టీఆర్‌ఎస్ గట్టిగా చెప్పుకోగల అభివృద్ధి కార్యక్రమేమైనా ఉందా అని ప్రశ్నించారు. ఐటీ కంపెనీలు పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలేవీ లేవని.. తెలంగాణలో నిరుద్యోగ భృతి ఇస్తారనుకుంటే ఇవ్వలేదని.. రైతుబంధు పథకంతో కౌలు రైతులకు ఒదిగిందేమీ లేదని లోకేష్‌ విమర్శించారు.

ఏపీలో ఒక ఏడాదిలో నిర్మించిన ఇళ్లను కూడా తెలంగాణలో నాలుగేళ్లలో నిర్మించలేకపోయారని లోకేష్‌ అన్నారు. బీజేపీతో కలిసేది లేదని చెబుతున్న కేసీఆర్‌.. ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారమే నడుస్తున్నట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. బీజేపీది టీఆర్‌ఎస్‌ది వేర్వేరు గోత్రాలు అన్న కేసీఆర్ మాటపై స్పందించిన లోకేష్‌… అక్రమ సంబంధాలకు గోత్రాలతో పనేంటని కౌంటర్‌ వేశారు. విభజన సమస్యల పరిష్కారంపై చంద్రబాబు ఎన్నిసార్లు అప్పాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వని ప్రధాని… కేసీఆర్‌ అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారని విమర్శించారు. సీఎంలకే దొరకని మోడీ అపాయింట్‌మెంట్‌ కేటీఆర్‌కు ఎలా దొరికిందన్నారు. ప్రీ పోల్‌ అలయెన్స్‌ పెట్టుకున్న టీడీపీకి ఎలాంటి సహకారం అందించని బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు మాత్రం అడక్కుండానే అన్నీ చేస్తోందని లోకేష్‌ మండిపడ్డారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -