తెలంగాణ అసెంబ్లీ రద్దు.. టీడీపీ వ్యూహం ఏంటి?

plan for tdp over telangana elections

తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీ-టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దు.. తదనంతర రాజకీయ పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పలువురు నేతలతో చర్చించారు. తెలంగాణలో టీడీపీ తో పొత్తుకు రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపుతున్నాయని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలుదేశం పార్టీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమంటోందని వారు చంద్రబాబుకు వివరించారు. కోదండరామ్, లెఫ్ట్‌ పార్టీలు ఐక్య కూటమితో వెళ్దామనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని వెల్లడించారు.

విభజన తరువాత తెలంగాణ విషయంలో ఏనాడు వ్యతిరేకంగా వ్యవహరించలేదనే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సాటి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ .. అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ రాజకీయాలపైనా నేతలతో చంద్రబాబు చర్చించారు. బీజేపి కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారని సీనియర్ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. బీజేపి ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు అభ్యర్దులను కేసీఆర్ ప్రకటించడక పోవడాన్ని రాయలసీమకు చెందిన నేత.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నేతలు, సలహాలు, సూచనలు తెలుసుకున్న చంద్రబాబు.. కలిసివచ్చే పార్టీలతో చర్చించి పనిచేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.