అప్పు చేసి మరీ టికెట్.. కూలీకి తగిలిన లాటరీ..

లక్ష్మీదేవి అందరినీ అనుగ్రహించదు. కొందరిని మాత్రమే కనికరిస్తుంది. వారికి వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది. నాలాంటి రోజు కూలీకి ఆశకు కూడా అంతుండాలి. తినడానికే డబ్బులు లేవు. ఇంక లాటరీ టికెట్ ఏం కొనాలి. రోజూ కూలి పనికి వెళ్లే దారిలో లాటరీ టికెట్ షాపు కనిపించినా ఇలానే అనుకుంటూ వెళ్లిపోయేవాడు మనోజ్ కుమార్. కానీ ఎందుకో మనసు పీకుతుంది. లాటరీ కొనమంటూ ఉసిగొల్పుతోంది. పంజాబ్ సంగ్రూర్ జిల్లాకు చెందిన మనోజ్ రోజువారీ కూలిచేసి జీవనం గడుపుతున్నాడు. లాటరీ తగిలితే తల రాత మారుతుందేమో అనుకున్నాడు.

కోటీశ్వరుడైనట్టు కలలు కన్నాడు. కానీ టికెట్ కొనడానిక్కూడా డబ్బులు లేని పరిస్థితి. తోటి కూలీని బతిమాలి అతడి దగ్గర నుంచి రూ.200లు అప్పు చేసాడు. ఆ డబ్బుతో లాటరీ టికెట్ కొన్నాడు. పంజాబ్ స్టేట్ లాటరీస్ అనే సంస్థ ఆగస్టు 29న పంజాబ్ స్టేట్ రాఖీ బంపర్ 2018 పేరుతో లాటరీ నిర్వహించింది. రెండు టికెట్లకు లాటరీ తగిలింది. మొదటి బహుమతిగా రూ.1.5 కోట్ల చొప్పున అందించింది. రెండు టికెట్లలో ఒకటి మనోజ్‌ది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తనకి లాటరీ తగిలి తన జీవితాన్ని మార్చేసిందని మనోజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఉండడానికి ఇల్లు లేని తనకి ఇంటితో పాటు మంచి జీవితాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాడు లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -