ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో ఆందోళన

st-act-kalraj-mishra/articleshow

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి సవరణలు నిరసిస్తూ.. చేపట్టిన బంద్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎస్పీ, ఎస్టీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నత కులాలకు చెందిన పరశురామ్ సేన, క్షత్రియ మహాసభ, కర్ణి సేన సహా ఇతరులు బంద్ పాటించారు. ఆందోళన కారులు.. పలుచోట్ల రైళ్లను నిలిపేశారు. మార్కెట్లను మూసివేశారు. పలు చోట్ల రోడ్లపై టైర్లను కాల్చి నిరసన తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లో ఆందోళలను మిన్నంటాయి. ఎన్నికలకు రెడీ అవుతున్న నేపథ్యంలో రిజర్వేషన్‌ వ్యతిరేక ర్యాలీ ఊపందుకుంది. ఉన్నత వర్గాలకు చెందిన వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో మధ్య ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. 35 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పాఠశాలలు, పెట్రో బంక్‌లు, దుకాణాలను మూసివేంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 కంపెనీ భ‌ద్రతా ద‌ళాల‌తో పాటు.. మ‌రో 5 వేల అద‌న‌పు బ‌ల‌గాల‌తో భద్రత ఏర్పాటు చేశారు.

కేంద్ర హోంశాఖ రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సెన్సిటివ్ ఏరియాల్లో ముందస్తుగా సెక్షన్ 144ను విధించారు. బీహార్‌లోని ఆర్రాలో ఆందోళనకారులు రైలును ఆపేశారు. దర్బంగాలో అలజడి సృష్టించారు. ఆందోళనలు నిర్వహించాలంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను బంద్ చేశారు.

ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్‌లో జన జీవనం స్తంభించింది. పాఠశాలలు మూత బడ్డాయి. రైలు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఆందోళన కారులు భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను ముట్టడించారు. ముందు జాగ్రత్త చర్యగా.. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బిహార్, జార్ఖండ్‌లో 144 సెక్షన్ విధించారు. పట్నాలో.. ఆందోళనకారులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆఫీస్ ముట్టడికి బయల్దేరగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.