ఇద్దరి మంత్రుల మధ్య ఆధిపత్యపోరు.. చివరకు..

ap ministers ganta srinivasarao vs ayyanna patrudu

టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్న అయ్యన్న, గంటా మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. గతంలో అనేక అంశాలు ఇద్దరి మధ్య అగ్గిరాజుకోవడానికి కారణమైతే ఈసారి నర్సీపట్నం మల్టీప్లెక్స్‌ నిర్మాణం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. నర్సీపట్నం నడిబొడ్డున ఉన్న 1.06 ఎకరాల ఆర్టీసీ స్థలంలో మంత్రి గంటా మల్టీప్లెక్స్‌ ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును కైవసం చేసుకున్నారు. అయితే, ప్రత్యూష కంపెనీకి విలువైన స్థలాలను అప్పగించడాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ స్థానంలో గ్రీన్‌ వుడ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టీడీపీ ప్రభుత్వం పనులు అప్పగించింది. అప్పుడు ఊరుకున్న అయ్యన్నపాత్రుడు.. ఇటీవల ఆ సంస్థ మల్టీప్లెక్స్‌ పనులు ప్రారంభించే సమయంలో అడ్డుకున్నారు. ఆర్టీసీ స్థలంలో మల్టీప్లెక్స్‌ నిర్మిస్తే ఆ గోతుల్లోనే పాటేస్తానంటూ గ్రీన్‌వుడ్‌ ప్రతినిధులను హెచ్చరించారు.

ఆ తర్వాత గ్రీన్‌ వుడ్‌ కంపెనీ డైరెక్టర్లు ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని ఏకరవు పెట్టారు. ప్రభుత్వం ఖరారు చేసిన ప్రాజెక్టును స్వయంగా మంత్రే అడ్డుకోవడం దుమారం రేపింది. సీఎంను కలిసిన తర్వాత న్సీపట్నంలో ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి అయ్యన్న సహా 8 మందిపై పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. ఇది అయ్యన్నకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి భరోసా ఉందనే అభిప్రాయానికి వచ్చిన మంత్రి కీలక సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కేబినెట్‌ సమావేశంతోపాటు, అసెంబ్లీ సమావేశాలకూ హాజరు కాలేదు.. కేవలం జిల్లాకే పరిమితం అయ్యారు.

మంత్రి అయ్యన్న వ్యవహార శైలిలో ఇటీవల చాలా మార్పు కనిపిస్తోంది.. గతంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఊహాగానాలపైనా అయ్యన్న ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. పొలిట్‌ బ్యూరోలో చర్చకు వస్తే వ్యతిరేకించే తొలి వ్యక్తిని తానేనంటూ ప్రకటించి అధిష్టానాన్ని సందిగ్ధంలో పడేశారు. తాజాగా మల్టీప్లెక్స్‌ వ్యవహారంలోనూ అధినేత నిర్ణయానికి ఎదురు నిలబడటం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధిష్టానానికి అయ్యన్న అల్టిమేటం ఇచ్చారా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.. మరి, ఈ వివాదానికి అధినేత చంద్రబాబు ఫుల్‌ స్టాప్‌ పెడతారా..? చూడాలి.