11 ఏళ్ల బాలుడు నదిలో కొట్టుకుపోతున్న ఇద్దర్ని కాపాడి.. మరో ఇద్దర్ని రక్షించబోతే..

11 ఏళ్ల వయసులో తనకు తాను రక్షించుకోవడమే రాదు. అలాంటిది తనతో పాటు మరో ఇద్దరిని కాపాడి కేంద్రమంత్రి చేత సెల్యూట్ చేయించుకున్నాడు. అసోం రాష్ట్రం బ్రహ్మపుత్ర‌నదిలో బోటు ప్రమాదానికి గురైంది. అమ్మ, అత్తతో పాటు కమల్ కిశోర్ కూడా నదిలో బోటు ప్రయాణం చేస్తున్నాడు.

కొద్ది దూరం ప్రయాణించాక పడవ తిరగబడింది. తల్లికి పరిస్థితి అర్థమై కిశోర్‌ని ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్లమని హెచ్చరించింది. కిశోర్ అలాగే అమ్మ చెప్పినట్లు ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే కళ్లముందే అమ్మ అత్త కొట్టుకుపోవడం కలచి వేసింది. మరేమీ ఆలోచించకుడా వెంటనే నదిలోకి దూకి తల్లిని, అత్తని చెరోపక్కా పట్టుకుని ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వారిని ఒడ్డుకు చేర్చి కొట్టుకుపోతున్న మరో మహిళను, ఆమె బిడ్డను కాపాడాలని ప్రయత్నించాడు. కానీ వారు కిశోర్ చేతికి చిక్కినట్టే చిక్కి మళ్లీ జారిపోయి నదిలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 11 మంది గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు. ఇద్దర్ని కాపాడిన కిశోర్ ధైర్యానికి మెచ్చుకుంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ‘కిశోర్ నువ్వు చాలా ధైర్యవంతుడివి, నీ ధైర్య సాహసాలకు నేను సెల్యూట్ చేస్తున్నా’నంటూ ట్వీట్ చేశారు.

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -