బీజేపీ కార్యవర్గ భేటీలో కీలక నిర్ణయం.. 2019లో బీజేపీ ప్రచారసారథిగా..

పలు అంశాల్లో విపక్షాలు దుమ్మెత్తిపోస్తుండడంతో.. రానున్న లోక్‌సభ ఎన్నికలను బీజేపీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏకతాటిపైకి వస్తున్న ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే.. మరోసారి లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై ఉంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయవర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2014 ఆగస్టులో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా.. పార్టీని విజయపథంలో నడిపించారు. 2016 జనవరిలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అమిత్‌షా పదవీకాలం 2019 జనవరితో ముగియనుంది. అయితే పార్టీ జాతీయకార్యవర్గం నిర్ణయం మేరకు .. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.

ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేలా.. తీసుకోవాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించినట్టు సమాచారం. అందుకే, పార్టీలో అపర చాణిక్యుడిగా గుర్తింపు పొందిన అమిత్‌షాపైనే మరోసారి ప్రచార బాధ్యతలను పెట్టింది. పోయినసారి వచ్చినన్ని సీట్లు సాధించడం కష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. అమిత్‌షానే మరోసారి ప్రచారసారథిగా ఉండాలని నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసి.. అమిత్‌షాకు మరో దఫా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -