సెప్టెంబర్ 10న భారత్ బంద్..

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాలు ఈనెల 10వ తేదీ దేశ వ్యాప్త హార్తాళ్‌కు పిలుపునిచ్చాయి. అనూహ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను ప్రధాన కారణంగా చూపుతూ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా చేపట్టనున్న ఈ బంద్‌లో పలు పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి.

రాజధాని ఢిల్లీలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, ఎస్‌యుసిఐ(సి), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలను వివరిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు వివిధ పార్టీలు మద్దతునిచ్చాయి. వాటిల్లో సమాజ్‌వాదీ, డీఎంకే, బీఎస్పీ, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, జేడీ(ఎస్), జేవీఎం, జేఎంఎం, ఆప్ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేసాయి. ఏపీలో జనసేన, లోక్‌సత్తా పార్టీలు బంద్‌లో పాల్గొననున్నాయి. జేడీయూ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలో బంద్‌‌లో పాల్గొంటాయని చెప్పారు.