కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి డీకే

former-minister-others-join-congress

తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో సమావేశమై పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య కాదని… ఇది కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీ అన్నారు.

కేసీఆర్ నిర్ణయం తప్పంటూ ఓ వైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే.. ఎలాగైనా ఈసారి టీఆర్ఎస్‌ను ఓడిండాలని ప్రతిపక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే సీట్లు కేటాయింపులు కూడా అయిపోయాయని పెద్దఎత్తున పుకార్లు వస్తున్నాయి. తెలంగాణలో పొత్తు విషయమై టీడీపీతో చర్చించాలని ముగ్గురు కీలక నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీ కీలక నేతలతో చర్చలు ఎప్పుడు.. ఎక్కడ జరపాలన్న దానిపై అధిష్ఠానం ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ముగ్గురు కీలక నేతలు రంగంలోకి దింపి.. తెలంగాణకు చెందిన టీడీపీ కీలక నేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యి చర్చిస్తారని సమాచారం. కాగా కాంగ్రెస్‌‌తో పొత్తుకు టీడీపీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఎన్నికలు ఖాయమవ్వడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌ కాంగ్రెస్‌ నేతలు మాటల మంటలు పుట్టిస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందన్నారు.

ఇక.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న పీసీసీ పెద్దలు.. ఆపరేషన్ ఆకర్ష్‌పైనా ఫోకస్‌ చేశారు. ఇతర పార్టీల నేతలతో పాటు గతంలో పార్టీని వీడిన వారికి స్వాగతం పలుకుతున్నారు. మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి కుంతియా, ఉత్తమ్‌ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు జిల్లాస్థాయి నాయకులు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.