తీవ్ర అనారోగ్యానికి గురైన హార్దిక్ పటేల్‌

hardik-patel-hospitalised-after-health-worsens

గుజరాత్‌లో నిరాహార దీక్షకు దిగిన పాటిదార్‌ నేత హార్దిక్ పటేల్‌ ఆరోగ్యం విషమించింది. పద్నాలుగు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేయడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో.. హార్దిక్‌పటేల్‌ను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రైతుల రుణమాఫీ డిమాండ్లపై హార్దిక్ పటేల్ గత నెల 25న నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ నిరసనను తీవ్రతరం చేశారు. గురువారం నుంచి కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా దీక్ష కొనసాగించాడు. అయినప్పటికీ హార్దిక్‌ దీక్షపై గుజరాత్‌ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. కాంగ్రెస్‌ కనుసన్నల్లోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో హార్దిక్‌ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన్ను సోలాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హార్దిక్ పటేల్ రెండు వారాల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించలేదని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి ప్రతినిధులు మండిపడ్డారు. ఆయన 20 కేజీలు తగ్గినట్లు చెప్పారు. ఆయన మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నట్లు తెలిపారు. హార్దిక్‌పటేల్‌ దీక్షకు కాంగ్రెస్‌ సహా విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.