రాహుల్ చికెన్ కుర్‌కురే తిన్నారంటూ రభస.. అవి నకిలీ..

no-rahul-gandhi-is-not-sharing-images-from-internet-as-that-from-his-kailash-mansarovar-yatra

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మానస సరోవర యాత్రపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ టూర్‌లో రాహుల్ చికెన్ కుర్‌కురే తిన్నారంటూ రభస సృష్టించిన బీజేపీ నేతలు.. తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు నకిలీవంటూ విమర్శల దాడి చేస్తున్నారు.

రాహుల్‌ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ అధికారికంగా రిలీజ్ చేసింది. రాహుల్ కూడా యాత్రకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. అయితే ఆయన నిజంగానే మానస సరోవర యాత్రకు వెళ్లారా.. లేక ఇంటర్నెట్‌లో ఫొటోలను డౌన్‌లోడ్ చేసి పెట్టారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో రాహుల్ బేస్‌క్యాంప్‌లో యాత్రికులతో ఉన్న వీడియోలను కాంగ్రెస్‌ పోస్ట్ చేసింది. తనతోపాటు యాత్ర చేస్తున్న వాళ్లతో రాహుల్ సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

మరోవైపు విశ్వమంతా శివమయం అంటూ మానస సరోవరయాత్ర నుంచి రాహుల్‌గాంధీ తొలి వీడియోను షేర్‌ చేశారు. ట్విటర్లో రాహుల్ పోస్టు చేసిన ఈ వీడియోలో.. పర్వత శ్రేణులు మంచు టోపీలు ధరించినట్టు కనిపిస్తున్నాయి. పరమశివుడి నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని సందర్శించేందుకు రాహుల్ 12 రోజుల పర్యటనకు వెళ్లారు. సముద్ర మట్టానికి 18,562 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత శిఖరాగ్రానికి 34 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ చీఫ్ కాలినడకన వెళ్లారు. సంప్రదాయక గుర్రపుస్వారీని వినియోగించకుండా అంతదూరం కాలినడకనే ప్రయాణించారు. ఆయనకు బందోబస్తుగా రెండు ప్రత్యేక భద్రతా బృందాలు వెంట ఉన్నాయి.

ఇక.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతిఇరానీ సెటైర్‌ వేవారు. భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధాన్ని రుజువు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

రాహుల్‌గాంధీ మానస సరోవరం దగ్గర ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటో బూటకమని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఆ ఫొటోను ఫొటోషాప్‌‌ను ఉపయోగించి సృష్టించారన్నారు. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ, ఆయనతోపాటు ఉన్న వ్యక్తి నీడలు కనిపిస్తున్నాయని… అయితే రాహుల్ చేతిలో ఉన్న కర్ర నీడ కనిపించడం లేదంటూ ట్వీట్‌ చేశారు.