మరోసారి భగ్గుమన్న పెట్రోధరలు.. రికార్డు స్థాయిలో..

petrol-diesel-rates-huge-hike

పెట్రోధరలు మరోసారి భగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలో పెరిగి చుక్కల్లో నిలిచాయి. బ్రేక్‌ లేకుండా కొనసాగుతున్న చమురు ధరల పెరుగుదలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పెట్రో ధరల పెరుగదల ఆగేలా కనిపించడం లేదు. రోజురోజుకూ చమురు ధరలు పైకిపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో పెట్రోధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80 రూపాయలు దాటిపోగా.. డీజిల్‌ ధర లీటరుకు 72 రూపాయల 51 పైసలుగా నమోదైంది. లీటర్‌ పెట్రోల ధర ముంబైలో 87 రూపాయలు 77 పైసలు, చెన్నైలో 83 రూపాయల 54 పైసలు, బెంగళూరులో 83 రూపాయలు, హైదరాబాద్‌లో 85 రూపాయల 23 పైసలకు చేరుకుంది. డీజిల్‌ ధర ముంబైల్‌లో లీటర్‌కు 76 రూపాయల 98పైసలు, చెన్నైలో 76రూపాయల 64 పైసలు, బెంగళూరులో 74రూపాయల 84పైసలు, హైదరాబాద్‌లో 78రూపాయల 87పైసలుగా నమోదైంది.

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన చమురు ధరలతో రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. గూడ్స్‌ రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చిన్నతరహా, మధ్య తరహా వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోంది.

పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందకు చేరువవుతున్న పెట్రోధరలతో జీవనం దుర్బరమవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా పెట్రోధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కేంద్ర ప్రభుత్వంలో మాత్రం స్పందన కరువైంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇరాన్‌, వెనిజులాలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులే కారణమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. ఈ ధరలను కంట్రోల్‌ చేయడం తమ చేతుల్లో లేదని చేతులెత్తేశారు.

మరోవైపు, పెట్రోధరలకు నిరసనగా కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమవుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్‌. పెట్రోధరల పెరుగుదలను నిరసిస్తూ ఈనెల 10న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ఇతర విపక్షపార్టీలూ మద్దతు తెలిపాయి.