లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఆయనే కమళదళ అధిపతి

లోక్‌సభ ఎన్నికల్లో​ విపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాలను సిద్దంచేస్తోంది. అత్యంత కీలకంగా భావిస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భుజాలపై పెట్టింది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఆయనే కమళదళ అధిపతిగా వ్యవహరించనున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నేతలు, శ్రేణులు పనిచేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశానికి అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్‌ షా.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాలకు తెలంగాణ, ఏపీ నుంచి నేతలు హాజరయ్యారు.

ఇక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాయకత్వంలోనే 2019 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని అధిష్టానం నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం అమిత్‌ షా పదవీకాలం 2019 జనవరితో ముగుస్తుంది. అయితే సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయిడం ద్వారా అమిత్‌షా నాయకత్వంలోనే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమిత్‌షా 2014 ఆగస్టులో పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్ కేంద్ర మంత్రివర్గంలో హోంమంత్రిగా చేరడంతో అమిత్‌ షా పార్టీ పగ్గాలు అందుకున్నారు. రాజ్‌నాథ్ పూర్తి చేయాల్సిన మూడేళ్ల పదవీ కాలాన్ని షా పూర్తి చేశారు. 2016 జనవరిలో మొదటి టర్మ్ మూడేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేయవచ్చు.

ప్రతిపక్షాల ఐక్యత కేవలం కంటితుడుపు చర్య లాంటిదని అమిత్ షా అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం మహా కూటమి పేరుతో ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొట్టిపారేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, రఫెల్‌ ఒప్పందంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. యథార్థమైన ఆధారాలను తీసుకొస్తే చర్చకు సిద్ధమేనని అమిత్‌షా ప్రకటించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ ఎన్నికలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ముందస్తుకు సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి అమిత్‌షా సూచించారు.

అమిత్‌ షా ఈనెల 15న మహబూబ్‌నగర్‌లో నిర్వహించబోయే మొదటి బహిరంగ సభకు హాజరై ప్రచారపర్వాన్ని భారీస్థాయిలో మొదలుపెట్టనున్నారు. జాతీయ స్థాయి నాయకులతోపాటు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ప్రచారంలో భాగం చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సభలు నిర్వహించి స్థానిక మేనిఫెస్టోలను సైతం ప్రజల ముందుంచనున్నట్లు తెలుస్తోంది.