బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..

bjp meet

సార్వత్రిక ఎన్నికల్లో విజయ వ్యూహాలే ప్రధాన ఎజెండాగా సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పెద్దలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరికొత్త భారత్‌, పేదరికం లేని భారత్‌ను ఆవిష్కృతం చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోంమంత్రి, పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మిగితా ప్రతినిధులు ఆమోదం తెలిపారు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ గృహ వసతి కల్పించాలని సమావేశంలో తీర్మానం చేశారు. ప్రదాని మోదీ 2022 విజన్‌కు అనుగుణంగా రూపొందించిన అన్ని తీర్మానాలకు కార్యవర్గ సమావేశాలు ఆమోదం తెలిపాయి.

ఇక, త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో.. తెలంగాణ ముందస్తు ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశాలకు హాజరైన తెలంగాణ బీజేపీ నేతలు.. ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.