ఎంత ప్రలోభపెట్టినా తెదేపాను వీడేది లేదని..

ఎంత ప్రలోభపెట్టినా తెదేపాను వీడేది లేదని..

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 9 నెలల తర్వాత టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కొత్త నాయకత్వం అవసరం ఉందని.. 119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తానని నేతలకు హామీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనేనని గుర్తుచేసిన చంద్రబాబు..హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో చేశామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఉండటం చారిత్రక అవసరమన్నారు చంద్రబాబు. ఇక్కడ పార్టీయే లేదంటూ కొందరు విమర్శిస్తున్నారని.. కానీ ఎవరూ అధైర్యపడొద్దన్నారాయన. వచ్చే శనివారం మళ్లీ నేతలతో సమావేశం అవుతానని తెలిపారు.. టీడీపీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. స్వార్థంతో కొందరు నాయకులు పోయారని...కానీ కార్యకర్తలే శాశ్వతమన్నారు. తెలుగుదేశం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని.. దెబ్బతిన్న ప్రతిసారి మళ్లీ పుంజుకున్నామని గుర్తుచేశారు. ఇతర పార్టీలు ఎంత ప్రలోభపెట్టిన తెదేపాను వీడేది లేదని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారని వివరించారు. మొత్తానికి చంద్రబాబు ప్రసంగం.... కార్యకర్తలు, నేతల్లో జోష్‌ నింపింది.

Tags

Read MoreRead Less
Next Story