గ్రేటర్‌లో అసంతృప్తి సెగలు..బొంతు రామ్మోహన్‌కు..

టీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. కేసీఆర్ నిర్ణయాన్ని ధిక్కరించలేక, అలాగని ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వదులుకోలేక లీడర్లు మథనపడిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 నుంచి 8 సెగ్మెట్లలో రెబల్స్‌తో గులాబీపార్టీలో కలకలం రేగుతోంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, శేరి లింగంపల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్‌ సహా పలుచోట్ల మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.

కూకట్‌పల్లి విషయానికి వస్తే టీడీపీ నుంచి వచ్చి TRSలో చేరిన తాజా మాజీ ఎమెల్యే మాధవరం కృష్ణారావుకే మళ్లీ టికెట్ కన్ఫామ్ అయ్యింది. దీన్ని గొట్టిముక్కల పద్మారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఈసారి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కూకట్‌పల్లి కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి భర్త పన్నాల హరీశ్వర్ రెడ్డి కూడా రెబల్‌గా బరిలోకి దిగుతానంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ పోటీ చేస్తారు. కేసీఆర్ ఆయనకు టికెట్ ఖరారు చేయడంతో.. వెంగళరావునగర్, రెహ్మత్ నగర్ కార్పొరేటర్లు రగిలిపోతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మురళి గౌడ్‌తోపాటు కొందరు మాజీ కార్పొరేటర్లు కూడా అధినేత నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మురళి.. ఈసారి టికెట్ ఇవ్వనందున రెబల్‌గా పోటీకి ప్లాన్ చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకే మళ్లీ టికెట్ దక్కింది. దీంతో.. అక్కడి నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ట్రై చేసిన కొలను హన్మంత్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగబోతున్నారు. సెటిలర్ల ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండే చోట అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే టికెట్లు ఫైనల్ చేసినట్టు అధిష్టానం చెప్తున్నా.. మరికొందరు పార్టీ నేతలు తమకు టికెట్ రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ మరోసారి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఐతే.. ఇక్కడ పోటీ చేయడానికి ఎప్పటి నుంచో గ్రౌండ్ రెడీ చేసుకుంటున్న శ్రీశైలంరెడ్డి తాజా పరిణామాలతో డీలా పడ్డారు. ప్రస్తుతం శ్రీశైలం రెడ్డి కుమారుడు మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా ఉన్నారు. పార్టీ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంగా వారు వేరే దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

శేరిలింగంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. దీంతో.. ఎప్పట్నుంచో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే అనుచరులతో సమావేశమై చర్చలు కూడా జరిపారు. జగదీశ్వర్‌ గౌడ్ భార్య పూజితా గౌడ్ కూడా హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరూ రివర్స్ అయితే.. కొంత డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉప్పల్ టీఆర్ఎస్‌లో పరిస్థితి కూడా ఇప్పుడు గందరగోళంగానే ఉంది. TRS టికెట్ భేతి సుభాష్‌రెడ్డికి దక్కడంతో మేయర్ బొంతు రామ్మోహన్ అలిగారు. ఎప్పటి నుంచో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు రామ్మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఈ టైమ్‌లో తనకు బదులు సుభాష్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంతో.. ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఫోన్‌లో కూడా ఎవరికి అందుబాటులోకి రావడం లేదు. అటు, ఏడుగురు కార్పొరేటర్లు బొంతు రామ్మోహన్‌కు మద్దతు పలికారు. సుభాష్‌రెడ్డిని తప్పించి మేయర్‌కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ ముఖ్యనేతలు అందరినీ కలుస్తున్నారు .

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.